హైదరాబాద్ హెచ్ఐసీసీలో ది ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ- ఐఎఫ్సీసీఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. తెలంగాణలో ఫ్రెంచ్ కంపెనీల పెట్టుబడుల విస్తరణ పేరిట ఈ సదస్సు జరిగింది. ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయెల్ సహా వంద మంది పారిశ్రామిక వాణిజ్య సంస్థల అధిపతులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఫ్రెంచ్ కంపెనీలకు పెద్దపీటవేస్తామని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ వంటి రంగాల్లో రాష్ట్రంలో అపార అవకాశాలున్నట్లు వివరించారు. ఇప్పటికే సనోఫీ, కియోలిస్, సెయింట్ గోబెన్ వంటి ఫ్రెంచ్ సంస్థలు రాణిస్తున్నాయని గుర్తుచేశారు. ఫ్రెంచ్ పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల అందించే ప్రోత్సాహకాలకు మించి తాము సహకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
విదేశీ పెట్టుబడులకు సంబంధించి విధాన రూపకల్పన కేంద్రం చేతుల్లో ఉంటుంది. కానీ ఆ తర్వాత సంస్థలకు కావాల్సినవన్నీ.. భూమి, నీరు, మానవ వనరులు, ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. సులభతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ తొలి మూడు స్థానాల్లో స్థిరంగా నిలుస్తోంది. మా విధానాలు పెట్టుబడులను ఆకర్షించడమే గాక సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రానికి పోటీగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఏం ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో మీరు వివరిస్తే మేం వారికి సమానంగా లేదా అంతకుమించి సహకారం అందిస్తాం.
ప్రభుత్వ అత్యుత్తమ విధానాలతో ఇప్పటికే 89 దేశాల కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సంస్థ లాభాల బాటలో సాగుతుండటం గర్వకారణమన్నారు. టీఎస్ ఐపాస్ వంటి పాలసీలతో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్నారు.