Satya Nadella Son: సత్య నాదెళ్ల.. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈఓ.. ఏడాదికి రూ.వందల కోట్ల వేతనం.. తీరిక లేని సమయం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. కోట్ల మందికి ఆదర్శం.. ఆయన జీవితం ఇంత ఘనంగా, గౌరవప్రదంగా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఎంతో విషాదం నెలకొంది. సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం(సెరబ్రల్ పాల్జీ) బారినపడటమే ఇందుకు కారణం.
పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్న సత్యనాదెళ్ల-అను దంపతులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. తమ కుమారుడు నెలలు నిండకముందే జన్మించడమే గాక.. అచేతన స్థితిలో ఉండటం చూసి వారు తల్లడిల్లిపోయారు. జైన్ జన్మించిన రోజు పరిస్థితి గురించి సత్య నాదెళ్ల 2017లో తన బ్లాగ్‌లో ఇలా వివరించారు.
" నా భార్య అను గర్భం దాల్చిన 36వ వారంలో ఓ రోజు ఆమెకు కడుపులో బిడ్డ కదులుతున్నట్లు అనిపించలేదు. వెంటనే బెల్వ్యూలోని స్థానిక ఆస్పత్రిలో ఎమర్జెన్సీ రూంకు వెళ్లాం. అది ఒక సాధారణ చెకప్ అని అనుకున్నాం. కొత్తగా తల్లిదండ్రులం కాబోతున్నాం కాబట్టి కొంత ఆందోళనగా ఉంది. ఎమర్జెన్సీ రూంలో మేం ఎంతసేపు చిరాకుగా నిరీక్షించామో నాకు ఇంకా గుర్తుంది. కానీ పరీక్షల అనంతరం వైద్యులు అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా సిజేరియన్ విభాగానికి తీసుకెళ్లాలని చెప్పారు. 1996 ఆగస్టు 13 రాత్రి 11:29 గంటలకు జైన్ జన్మించాడు. కేవలం మూడు పౌండ్లు(1.36 కిలోలు) బరువున్నాడు. పుట్టినప్పుడు అసలు ఏడవలేదు. ఆ తర్వాత జైన్‌ను బెల్వ్యూ హాస్పిటల్ నుంచి సియాటెల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్లిష్టమైన ప్రసవం అనంతరం అను నెమ్మదిగా కోలుకుంది. ఆ రోజు రాత్రంతా నేను ఆమెతో పాటు అదే ఆస్పత్రిలో ఉన్నాను. ఆ మర్నాడు జైన్‌ను చూసేందుకు వెళ్లాను. అప్పుడే మా జీవితాలు ఎలా మారబోతున్నాయని నాకు కాస్త అర్థమయింది. శిశివు గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఎంతటి నష్టం వాటల్లుతుందో రెండేళ్ల తర్వాత మాకు తెలిసింది. జైన్‌కు వీల్ ఛైర్ అవసరమవుతుందని, మస్తిష్క పక్షవాతం కారణంగా అతడు పూర్తిగా మాపైనే ఆధారపడతాడని అర్థమైంది. నాకు తీవ్ర విషాదం మిగిలింది. అను పరిస్థితి, నా పరిస్థితి ఇంతలా మారిపోయినందుకు ఎంతో బాధగా ఉంది "
-బ్లాగ్ పోస్టులో సత్య నాదెళ్ల