తెలంగాణ

telangana

ETV Bharat / business

Mehul Choksi:​ చోక్సీ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ - డొమినికా మెహుల్​ చోక్సీ

వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీ(Mehul Choksi) వేసిన బెయిల్​ పిటిషన్​ను డొమినికా మెజిస్ట్రేట్​ కోర్టు తిరస్కరించింది. పై కోర్టుకు వెళతామని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. చోక్సీ(Mehul Choksi).. చక్రాల కుర్చీలో కోర్టు ముందు హాజరయ్యారు.

MEHUL CHOKSI DOMINICA
మెహుల్​ చోక్సీ

By

Published : Jun 3, 2021, 9:29 AM IST

Updated : Jun 3, 2021, 10:48 AM IST

పీఎన్​బీ కుంభకోణంలో 13వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీకి(Mehul Choksi) మరో ఎదురుదెబ్బ తగిలింది. డొమినికా పోలీసుల చెంత ఉన్న ఆయన బెయిల్​ పిటిషన్​ను ఆ దేశ మెజిస్ట్రేట్​ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికి.. పై కోర్టులో పిటిషన్​ దాఖలు చేయనున్నట్టు చోక్సీ తరపు న్యాయవాది వెల్లడించారు.

అంతకుముందు.. చోక్సీ(Mehul Choksi) చక్రాల కుర్చీలో కోర్టుకు వచ్చారని స్థానిక మీడియా పేర్కొంది. ఆంటిగ్వా నుంచి డొమినికాకు అక్రమంగా ఎందుకు ప్రవేశించారో చెప్పాలని కోర్టు ఆదేశించిన కారణంగా వ్యక్తిగతంగా హాజరయ్యారు చోక్సీ. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇది చోక్సీ పౌరసత్వం గురించి జరుగుతున్న విచారణ కాదని, అక్రమంగా దేశంలోకి ప్రవేశంపై దాఖలైన పిటిషన్​ అని స్పష్టం చేసింది.

మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. కొద్దిరోజులకు డొమినికాలో ప్రత్యక్షమయ్యారు. చోక్సీని ఎవరో అపహరించి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదిస్తుండగా.. అక్రమంగానే ప్రవేశించారని అక్కడి పోలీసులు తేల్చిచెబుతున్నారు.

ఇదీ చూడండి:-Mehul Choksi: దిల్లీలో దిగగానే చోక్సీ అరెస్ట్​?

కోర్టులో విపక్ష నేత!

విచారణ సందర్భంగా.. చోక్సీ సోదరుడు చేతన్​ చినిభాయ్​ చోక్సీతో పాటు డొమినికా విపక్ష పార్టీకి చెందిన లెన్నాక్స్​ లింటన్​ కోర్టులో ఉన్నట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. మెహుల్​ చోక్సీని అపహరించారనే వాదనను పార్లమెంట్​లో బలంగా వినిపించాలని, తద్వారా రానున్న ఎన్నికల్లో భారీగా నిధులు సమకూరుస్తామని లింటన్​కు చేతన్​ ఆఫర్​ ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో కోర్టు గదిలో ఆయన కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెహుల్​ చోక్సీ(Mehul Choksi) కుటుంబంతో అసలు తనకు సంబంధమే లేదని తేల్చిచెప్పిన ఆయన, చేతన్​తో కలిసి ఉండటం గమనార్హం.

ఆమె ముందే తెలుసు!

చోక్సీ తన గర్ల్​ఫ్రెండ్​తో డొమినికాకు విహారయాత్రకు వెళ్లగా పోలీసులు పట్టుకున్నారని ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. తాజాగా దీని మీద ఆయన భార్య ప్రీతి చోక్సీ స్పందించారు. తన భర్త, ఆయన సన్నిహితులకు ఆ మహిళకు ముందు నుంచే పరిచయం ఉందన్నారు. ఆంటిగ్వా వచ్చినప్పుడల్లా ఆమె తన భర్తను కలిసేదని పేర్కొన్నారు.

అయితే తన భర్తను భౌతికంగా చిత్రహింసలు పెట్టడం కుటుంబాన్ని కలచివేసిందని వెల్లడించారు ప్రీతి.

ఇదీ చూడండి:-Mehul Choksi: జైలులో గాయాలతో ఛోక్సీ- ఫొటోలు వైరల్​!

Last Updated : Jun 3, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details