తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2021, 11:07 AM IST

ETV Bharat / business

Mehul Choksi: చోక్సీ ముంచింది రూ.6,344కోట్ల పైనే

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు మెహుల్‌ ఛోక్సీపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్​లోని కీలక విషయాలు వెల్లడయ్యాయి. పీఎన్​బీకి ఛోక్సీ రూ.6,344.96 కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టినట్లు దీని ద్వారా తెలిసింది. ఈ ఛార్జ్​ షీట్​లో కొత్తగా నలుగురి పేర్లను చేర్చింది సీబీఐ.

Mohul Choksi PNB scandal  value
మోహుల్ ఛోక్సి కుంభకోణం విలువ

వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ.6,344.96 కోట్లకు పైగా మోసం చేసినట్లు సీబీఐ తాజా అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది. లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎల్‌ఓయూ), ఫారిన్‌ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎఫ్‌ఎల్‌సీ) పత్రాలను ఉపయోగించి మోసాలకు తెరతీసినట్లు తెలిపింది.

కుట్రలో పీఎన్​బీ ఉద్యోగులు..

ఈ కుట్రకు పీఎన్‌బీ ఉద్యోగులు కూడా సహకరించారని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి తొలి అభియోగపత్రంలో 18 మందిని నిందితులుగా చేర్చిన సీబీఐ, తాజా ఛార్జిషీటులో మరో నలుగురి పేర్లు చేర్చింది. వారిలో గీతాంజలి సంస్థల మాజీ అంతర్జాతీయ అధిపతి సునీల్‌ వర్మ, నక్షత్ర సంస్థ డైరెక్టర్‌ ధనేష్‌ సేథ్‌తో పాటు ఇద్దరు పీఎన్‌బీ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు.

అసలు నష్టం తేలేది అప్పుడే..

మూడేళ్ల దర్యాప్తులో బయటపడ్డ వివరాలతో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రం ప్రకారం.. బ్రాడీ శాఖలోని పీఎన్‌బీ ఉద్యోగులు 2017 మార్చి-ఏప్రిల్‌ మధ్య 165 ఎల్‌ఓయూ, 58 ఎఫ్‌ఎల్‌సీ పత్రాలను ఛోక్సీకి చెందిన సంస్థల పేరిట జారీ చేశారు. వాటికి నగదు పరిమితిని కూడా విధించలేదు. ఆడిట్‌ నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఈ వివరాలను పీఎన్‌బీ కేంద్రీకృత బ్యాంకింగ్‌ వ్యవస్థలో నమోదు చేయలేదు. ఆ పత్రాల ద్వారా వివిధ దేశాల్లోని పలు బ్యాంకులు ఛోక్సీ సంస్థలకు రుణాలు మంజూరు చేశాయి. అయితే వాటిని ఛోక్సీ ఉద్దేశపూర్వకంగానే తిరిగి చెల్లించలేదు. దీంతో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పీఎన్‌బీ చెల్లించాల్సి వచ్చింది. 2014, 2015, 2016ల్లో జారీ చేసిన ఎల్‌ఓయూ, ఎఫ్‌ఎల్‌సీలపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తోంది. అది పూర్తయ్యాకే పీఎన్‌బీకి జరిగిన నష్టం ఎంతో తేలనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details