చైనాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మనదేశంలో ఔషధాల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి రసాయనాలు, సాల్వెంట్లు, ఇంటర్మీడియెట్లను ఉత్పత్తి చేసే చైనా కంపెనీలపై ఆ దేశ ప్రభుత్వం కఠిన కాలుష్య నిబంధనలతో కొరడా ఝుళిపిస్తోంది. దీంతో అక్కడి నుంచి మనదేశానికి ముడి రసాయనాలు తగినంతగా దిగుమతి కావడం లేదు. ఫలితంగా ఒక్కసారిగా రసాయనాలు ధరలు పెరిగిపోయాయి. పైగా కొరత కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా లభించే కొన్ని ముడి రసాయనాల ధరలను ఇక్కడి కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల ఔషధ కంపెనీలు ముడిపదార్థాలు, ఇంటర్మీడియెట్లను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ముడి రసాయనాలు, ఇంటర్మీడియెట్ల ధరలు బాగా పెరిగిపోవడంతో ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం పరిసరాల్లో ఔషధ పరిశ్రమల విభాగాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
తక్కువ ధరల కోసమే చైనా వైపు
చైనాలో కఠినమైన కాలుష్య నిబంధనలను అమలు చేస్తూ, రసాయనాలను ఉత్పత్తి చేసే కంపెనీలను మూసి వేయడం గత నాలుగైదేళ్లుగా జరుగుతోంది. కానీ ఇటీవల కాలంలో ఆ దేశ ప్రభుత్వం నిబంధనలను ఇంకా కట్టుదిట్టం చేయడంతో ఎన్నో యూనిట్లు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితిని మనదేశంలో ప్రభుత్వం, పరిశ్రమ ఊహించినప్పటికీ తగిన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోనందున ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు తక్కువ ధరకు లభిస్తున్నాయనే కారణంతో చైనా నుంచి ముడిరసాయనాలను మన కంపెనీలు కొనుగోలు చేస్తూ వచ్చాయి. దీనివల్ల స్థానికంగా ముడిరసాయనాలు ఉత్పత్తి చేసే సంస్థలు తగ్గిపోయాయి. ఒక వేళ ఉన్నప్పటికీ చైనా ధరలతో పోటీపడలేని పరిస్థితి. వివిధ పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా దేశీయంగా ముడి రసాయనాల ఉత్పత్తిని పెంచేందుకు ఇటీవల కాలంలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి కార్యరూపం దాల్చడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆరేడు నెలలు ఇంతేనా?