మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ వస్తుందంటే ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ఎంత ర్యామ్ ఇస్తున్నారు.. డిస్‌ప్లే.. బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై దృష్టి పెడతాం. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. త్వరలోనే 5జీ సేవలను అందించేందుకు నెట్‌వర్క్ సంస్థలు సిద్ధం అవుతుండటంతో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్‌తో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కానీ, వాటి ధర ఎక్కువ కావడంతో 5జీ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ అనేది బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
5జీ ఫోన్లలో ఉపయోగించే ప్రాసెసర్ ఎక్కువ ఖరీదు కావడం వల్లనే ఫోన్ల ధరలు పెంచాల్సి వస్తోందనేది మొబైల్ కంపెనీల వాదన. దీనిదృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ధర ఫోన్లు తయారు చేసే కంపెనీల కోసం మీడియా టెక్ కంపెనీ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మీడియాటెక్ బడ్జెట్ ఫోన్ల కోసం డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తీసుకొచ్చింది. తాజా ప్రకటనతో బడ్జెట్ ధరలో 5జీ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ 5జీని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల ఒకే ఫోన్‌లో రెండు 5జీ నెటవర్క్‌లను మీరు ఉపయోగించవచ్చు.