దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి ధరల పెంపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది.
'గత కొన్నేళ్లుగా వివిధ ముడి సరకు ధరలు, నిర్వహణ ఖర్చులు పెరగటం వల్ల.. వాహన తయారీ వ్యయాలు పెరుగుతున్నాయి. అదనపు భారంలో కొంత మొత్తాన్ని వినియోగదారులకు ధరల పెంపు ద్వారా బదిలీ చేయడం తప్పడం లేదు' అని మారుతీ సుజుకీ తెలిపింది.
ధరల పెరుగుదల సెప్టెంబర్ నుంచి ఉండొచ్చని వెల్లడించింది. అయితే ఏ మోడల్‌పై ఎంత ధర పెరగనుందని అనే విషయాన్ని కంపెనీ ఇంకా చెప్పలేదు.
మారుతీ సుజుకీ ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఆల్టో నుంచి ఎస్-క్రాస్రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల (దిల్లీ ఎక్స్‌షోరూం) ధరల స్థాయిలో కార్లను విక్రయిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటికే పలు మార్లు ధరలు పెంచింది మారుతీ సుజుకీ. జులైలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లోని స్విఫ్ట్ సహా.. అన్ని సీఎన్జీ మోడళ్ల ధరలను (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.15,000 వరకు పెంచింది. ఏప్రిల్ 16న మోడళ్ల వారీగా.. సగటు ధర 1.6 శాతం పెరిగింది. జనవరి 18న ఎంపిక చేసిన మోడళ్లపై రూ.34 వేల వరకు ధర పెంచింది మారుతీ సుజుకీ.
ఇదీ చదవండి:కారులోకి వరద నీరు చేరితే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?