Maruti Suzuki: దేశీయంగా ప్రయాణికుల కార్ల విపణిలో తన అగ్రశ్రేణి మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు మరిన్ని స్పోర్ట్స్ వినియోగ వాహనాలను(ఎస్‌యూవీ) ఆవిష్కరించేందుకు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రయత్నిస్తోంది. దేశీయంగా ఏడాదికి 30 లక్షల కార్లు విక్రయమవుతుండగా, ఇందులో ఎంఎస్‌ఐ వాటా 45 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇది 48 శాతంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఎస్‌వీయూల అమ్మకాలు గణనీయంగా పెరగ్గా, ఇందులో ఎంఎస్‌ఐ 2 మోడళ్లు బ్రెజా, ఎస్ క్రాస్ మాత్రమే విక్రయిస్తోంది. ఈ విభాగంలో మరిన్ని మోడళ్లు ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఎంఎస్‌ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మోడళ్లలో పోటీ ఎంతున్నా, గత 20 ఏళ్లుగా అగ్రస్థానం మారుతీ సుజుకీదే కాగా, గత అయిదేళ్లుగా ఎంఎస్‌ఐ వాటా పెరుగుతోందని గుర్తు చేశారు. ఎస్‌యూవీల్లోనే కొన్ని ఉప విభాగాల్లో తమ మోడళ్లు లేకపోవడం వల్ల ఈ విభాగంలో తక్కువ వాటా ఉన్నట్లు అంగీకరించారు.
ఎస్‌యూవీల అమ్మకాలే 38 శాతం
ప్రస్తుతం దేశీయంగా ఎస్‌యూవీల్లో 46 బ్రాండ్లు ఉండగా, తమవి రెండేనని గుర్తు చేశారు. మొత్తం కార్ల అమ్మకాల్లో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 38 శాతానికి చేరిందని, గతేడాది ఇది 32 శాతమేనని వివరించారు. ఇంతవేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీల్లో వాటా తక్కువగా ఉన్నందునే, మొత్తం కార్ల అమ్మకాల్లో తమ వాటా కాస్త తగ్గిందని తెలిపారు. ఎస్‌యూవీల్లో ప్రారంభస్థాయి, మధ్యస్థాయి, హైఎండ్, లైఫ్‌స్టైల్ విభాగాలకు అధిక ఆదరణ లభిస్తోందన్నారు ప్రీమియం ఎస్‌యూవీల వాటా 1 శాతానికంటే తక్కువే అన్నారు. అందువల్ల ఈ తరహా వాహనాలన్నీ తీసుకురావాలన్నది తమ ప్రయత్నంగా వెల్లడించారు. చిప్‌ల కొరత వల్ల సాధారణ తయారీతో పోలిస్తే, గత అక్టోబరులో 60 శాతమే చేయగలిగామని, ఈ ఏడాది జనవరిలో ఇది 90-93 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30 లక్షల విక్రయాలు అమ్ముడవుతాయన్నది పరిశ్రమ అంచనాగా వివరించారు. తయారీ 100 శాతానికి ఎప్పుడు చేరుతుందో చెప్పలేమన్నారు.