కరోనా సెగ నుంచి వాహన సంస్థలు ఇంకా కోలుకోలేదు. జూన్‌లోనూ అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. అగ్రగామి సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, మహీంద్రాలు అమ్మకాల్లో భారీ క్షీణత చవిచూశాయి. అయితే మే పతనంతో పోలిస్తే స్వల్పంగా కోలుకున్నాయి. మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాలు 1,24,708 నుంచి 54 శాతం తగ్గి 57,428కు చేరాయి. మేలో నమోదైన 13,888 విక్రయాలతో పోలిస్తే మెరుగైంది.
ఆల్టో, వ్యాగన్‌ఆర్‌లు కూడిన చిన్న కార్ల విభాగం అమ్మకాలు మాత్రం 44.2 శాతం తగ్గి.. 18,733 నుంచి 10,458కు చేరాయి. స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో లాంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 62,897 నుంచి 57.6 శాతం క్షీణించి 26,696కు చేరాయి. యుటిలిటీ విభాగం విక్రయాలు 45.1 శాతం తగ్గి 9,764కు పరిమితమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు సైతం 58,807 నుంచి 26,820కి చేరాయి.