Market Outlook Next Week: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, ఒమిక్రాన్‌కు సంబంధించిన వార్తలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వారం కూడా సూచీలు కొంత ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ పాలసీతో పాటు స్థూల ఆర్థిక గణాంకాల ప్రకటన కూడా ఈ వారం.. మార్కెట్లను ప్రభావితం చేయనుంది. మదుపురులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు.
"ఒమిక్రాన్ వార్తలు, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, స్థూల ఆర్థిక గణాంకాలు మధ్య ఈ వారం మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా వైరస్ వ్యాప్తికి సంబంధించిన వార్తలు మార్కెట్ అస్థిరతకు కారణం కావచ్చు. దేశీయంగా చూస్తే.. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై కూడా మార్కెట్ల తీరు ఆధారపడి ఉంటుంది. ఈ మీటింగ్ ఈ 8వ తేదీన షెడ్యూల్ అయ్యింది. వీటితో పాటు ద్రవ్యోల్భణ సమాచారం కూడా ప్రభావం చూపనుంది."
-సంతోష్ మీనా, రీసెర్చ్ హెడ్ స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్
దేశంలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన నేపథ్యంలో భారతీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇది ఈ వారం సైతం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
"ఈ వారంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. కొవిడ్‌తో పాటు దేశీయంగా సీపీఐ ద్రవ్యోల్భణం, స్థూల ఆర్థిక గణాకాల ప్రకటన ఉంటుంది. దీనితో పాటు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కూడా మార్కెట్‌ను దిశానిర్దేశం చేస్తుంది. "