ఎఫ్‌పీఐల వెల్లువతో సరికొత్త రికార్డుల దిశగా సూచీలు..! - rupee
గత వారం లాభాల్లో సాగిన స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు విరివిగా వస్తుండటమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. సిమెంట్ షేర్లకు సానుకూలతలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే.. బ్యాంకింగ్ షేర్లు లాభాల స్వీకరణకు గురయ్యే అవకాశముందని అంటున్నారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు దేశీయ మార్కెట్లలోకి విరివిగా వస్తుండడంతో ఈ వారం మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు), రిటైల్ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం కూడా లేకపోలేదు. నిప్టీ ఈ వారం 12,600-13,000 పాయింట్ల మధ్య కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, 2021లో ఆర్థిక వ్యవస్థలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉండటంతో మౌలిక, భారీ యంత్ర పరికరాలు, ప్రయాణ, పర్యాటక, విమానయాన షేర్లకు సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఐరోపా సమాఖ్య ప్రతినిధులు గురువారం జరగబోయే సమావేశంలో బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది మదుపర్లు ఆసక్తిగా గమనించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.
- ఇంధన ధరల రూపేణ రిఫైనరీ షేర్లకు సానుకూలతలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ధరల ఆధారంగా చమురు రంగ షేర్లలో కదలికలుంటాయి.
- టాటా స్టీల్ ఫలితాల వల్ల నేడు సానుకూలంగా చలించవచ్చు. అల్యూమినియం ధరల్ని వేదాంతా, హిందాల్కోలు పెంచాయి. చైనా నుంచి గిరాకీ వల్ల లోహ, గనుల తవ్వక రంగ షేర్లు సానుకూలంగా ట్రేడవవచ్చు.
- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో ప్రయోజనాలుంటాయి కనుక ఔషధ కంపెనీల లాభాలు ఈ వారం కొనసాగే అవకాశం ఉంది.
- వాహన కంపెనీల షేర్లు మార్కెట్ నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. స్వల్ప శ్రేణిలో కదలాడవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- టెలికాం కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి సానుకూలంగా చలించవచ్చు. ఎయిర్‌టెల్ షేరు సానుకూల ధోరణిపై, వొడాఫోన్ ఐడియా షేర్లపై అనాసక్తి కొనసాగొచ్చు.
- సిమెంటు కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో కదలాడొచ్చు. గిరాకీ పెరుగుతుండడం; కొన్ని కంపెనీలు సిమెంట్ ధరలు పెంచడం నేపథ్యం.
- యంత్రపరికరాల షేర్లు తక్కువ శ్రేణిలో చలించవచ్చు. ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కానుండటం కలిసొస్తుంది.
- ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఈ వారం సానుకూలంగా చలించవచ్చు. ఉద్దీపన పథకంతో గ్రామీణ గిరాకీ మరింతగా పెరుగుతుందనే అంచనా వేస్తున్నాయి.
- బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉన్నా, సానుకూలంగా కదలాడొచ్చు. రుణ మారటోరియంపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలున్నాయి.
- ఐటీ రంగ షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కొవిడ్-19 సంక్రమణ రెండోదశ విజృంభణతో (సెకండ్ వేవ్) మదుపర్ల సెంటిమెంటు దెబ్బ తినడమే ఇందుకు నేపథ్యం.