2022 కొత్త ఏడాదిలో మొదటి నెల పూర్తయి రెండో నెలలోకి అడుగుపెడుతున్నాం. అయితే, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సామాన్యుడిని ప్రభావితం చేసే బ్యాంకింగ్ నిబంధనలు, ఎల్పీజీ ధరల్లో మార్పులు జరగనున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీల్లో మార్పు..
SBI imps rates: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. కస్టమర్లకు శుభవార్త అందించింది. డిజిటల్ ఇమీడియట్ పేమెంట్స్ సర్వీస్(ఐఎంపీఎస్) లావాదేవీల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి సేవా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2022, ఫిబ్రవరి 1న అమలులోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ వినియోగదారులు.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచితంగా ఐఎంపీఎస్ సేవలను పొందవచ్చు. గతంలో ఉచిత చెల్లింపులు రూ.2 లక్షల వరకే అందించగా.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.5 లక్షల వరకు పెంచినట్లు తెలిపింది బ్యాంక్.
బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చెల్లిస్తే..
ఏదైనా ఎస్బీఐ బ్యాంక్ శాఖ ద్వారా ఐఎంపీఎస్ చెల్లింపులు చేస్తే.. ప్రస్తుతం ఉన్న స్లాబ్‌ల ప్రకారమే సేవా రుసుములు ఉంటాయని, ఎలాంటి మార్పులు చేయటం లేదని స్పష్టం చేసింది. అయితే.. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లింపుల స్లాబ్‌ను కొత్తగా తీసుకొచ్చింది ఎస్బీఐ. దీనికి రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఫిబ్రవరి 1న అమలులోకి రానుంది.