కొవిడ్-19 మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితుల వల్ల కుప్పకూలిన తయారీ రంగం నెమ్మదిగా కోలుకుంటోందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్పష్టం చేసింది. 'ఫిక్కీ మానుఫ్యాక్చరింగ్ సర్వే' పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయంగా తయారీ రంగంలో కొంత సానుకూలత కనిపించింది. నాలుగో త్రైమాసికంలో బాగా కోలుకున్నట్లు వెల్లడవుతోంది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో అధికోత్పత్తి సాధించినట్లు 24% మంది తెలుపగా.. మూడో త్రైమాసికానికి వచ్చే సరికి ఇది 33% అయినట్టు ఫిక్కీ వెల్లడించింది. వాహన, యంత్ర పరికరాలు, సిమెంటు- సిరామిక్స్, రసాయనాలు, ఎరువులు, ఔషధ, ఎలక్ట్రానిక్స్.. తదితర 12 ప్రధాన రంగాలకు చెందిన 300 తయారీ యూనిట్లలో ఫిక్కీ అధ్యయనం చేసింది. ఇందులో భారీ, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.
ఉత్పత్తి సామర్థ్యం అధికం
- తయారీ రంగంలో ఉత్పత్తి సామర్థ్య వినియోగం మూడో త్రైమాసికంలో 74 శాతానికి పెరిగింది. 2019-20 ఇదేకాలంలో ఇది 65% మాత్రమే. వచ్చే 6 నెలల్లో అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకుంటామని 30% మంది చెప్పారు.
- ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికంగా వినియోగించుకోవడం వాహన తయారీ కంపెనీలతో పాటు మూలధన వస్తువులు, సిమెంటు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల్లో కనిపిస్తోంది. జౌళి, కాగితం వస్తువుల తయారీ యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం మూడో త్రైమాసింలో తక్కువగా ఉంది.
- ఎగుమతులు పెరుగుతాయనే ఆశాభావాన్ని 29% వ్యక్తం చేశారు.
- కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు 37% మంది పేర్కొన్నారు.
ఇవీ సవాళ్లు