ఫిబ్రవరిలో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు స్వల్పంగా నెమ్మదించాయి. అయితే, కొవిడ్ తర్వాత డిమాండ్ పుంజుకుంటుండడంతో తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్ నెలవారీ సర్వే వెల్లడించింది. ఇక జనవరిలో 57.7గా ఉన్న మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) గత నెల 57.5కు తగ్గింది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.
స్వల్పంగా నెమ్మదించిన 'తయారీ'
కొవిడ్ తర్వాత డిమాండ్ పుంజుకుంటుండడం వల్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్ నెలవారీ సర్వే తెలిపింది. ఫిబ్రవరిలో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించినట్లు పేర్కొంది.
ఫిబ్రవరిలో భారత్‌లోని తయారీ సంస్థలు భారీ స్థాయిలో కొత్త ఆర్డర్లు అందుకున్నాయని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ప్రతినిధి లిమా తెలిపారు. ఈ నేపథ్యంలో తయారీ కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లు కూడా పుంజుకోనున్నాయని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ నేపథ్యంలో వనరుల కొరతతో సంస్థల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడిందని వివరించారు. లేదంటే ఉత్పత్తి కార్యకలాపాలు గత నెల మరింత బలంగా ఉండి ఉండేవని తెలిపారు. ఇక ఉద్యోగ కల్పనపై కొవిడ్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు విడతలవారీగా పనిచేయాల్సిన అవసరం ఉండడంతో కొత్త నియామకాలకు సంస్థలకు వెసులుబాటు కావడం లేదు. ఇక ముడి సరకులు, సెమీ ఫినిష్డ్ వస్తువుల ధరలు పెరగడంతో ఉత్పత్తి ఖర్చుల ద్రవ్యోల్బణం 32 నెలల గరిష్ఠానికి చేరినట్లు ఐహెచ్‌ఎస్ మార్కిట్ సర్వే తెలిపింది.