జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి గత రెండు నెలల కాలంలో ఆరు సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వాటి మొత్తం విలువ రూ. 92,202.15 కోట్లుగా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇలాంటి మహమ్మారి సంక్షోభం కాలంలోనూ రిలయన్స్ జోరు వెనుక ఓ వ్యక్తి ఉన్నారట. ఆయనే మనోజ్ మోదీ.. ముఖేశ్ రైట్‌హ్యాండ్.
నిశ్శబ్దంగా తన ఆయుధం..
మనోజ్ మోదీ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు బహిరంగ కార్యక్రమంలో ఆయన కనిపించడం చాలా అరుదు. పూర్తిగా లోప్రొఫైల్‌లో ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో మోదీ ఒకరు. ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌తో జరిగిన డీల్‌లో ముఖేష్ అంబానీ, ఆకాశ్ అంబానీల వ్యూహం వెనుక మనోజ్‌పాత్ర ఉంది. ఆయన రిలయన్స్ రిటైల్‌తోపాటు రియలన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ తన గురించి ఆయన చెప్పుకోరు.
ఓ సదస్సులో ఆయన మాట్లాడతూ.. "నేను బేరాలు చేయలేను. నాకు వ్యూహాలు అర్థం కావు. కంపెనీలో అంతర్గతంగా ఉండేవారికి ఈ విషయాలు తెలుసు. నాకు పెద్దగా ముందు చూపు కూడా లేదు. నేను కేవలం సంస్థలో ఉన్నవారితో కలిసి పనిచేస్తా. వారికి శిక్షణ ఇవ్వడం.. కీలకమైన బాధ్యతలను ఎలా నిర్వహించాలో నేర్పిస్తా. మనతో కలిసిన వ్యాపార భాగస్వాములు లాభపడనంతకాలం.. మనం నిలదొక్కుకోలేం అనే రిలయన్స్ వ్యాపార సూత్రం నాకు మార్గదర్శి" అని పేర్కొన్నారు.
అతడితో బేరాలొద్దమ్మా..!
రిలయన్స్ ఆయన కనుసన్నల్లోనే స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. చర్చలు జరపడం.. బేరాలాడటంలో మనోజ్‌ది అందెవేసిన చేయి. ఇటీవల రిలయన్స్ కొనుగోలు చేసిన కృత్రిమ మేధ నుంచి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ స్టార్టప్‌ల వరకు ఆయన కృషి ఉంది. రిలయన్స్ డిజిటల్ వ్యాపారాలను బలోపేతం చేయడానికి ఈ డీల్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. చాలా ఒప్పందాలు మనోజ్‌తో మీటింగ్ జరిగితే దానికి రిలయన్స్ ఆమోద ముద్రపడినట్లేని భావిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా సదరు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులే వెల్లడించారు.
"ఆయన రిలయన్స్‌కు కేవలం నమ్మకస్తుడు మాత్రమే కాదు. తెలివితేటలు.. చర్చలు జరపగల నేర్పరితనం వంటి ఆయన లక్షణాలు సంస్థకు అదనపు బలం. కేవలం అసాధారణ చాతుర్యం.. భారతీయులకు ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోగల నైపుణ్యం.. ముందుచూపు వంటివి ఆయన్ను ఈ స్థితిలో నిలిపాయి" అని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపీనాథ్ పేర్కొన్నారు.