భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌కు పరారైన విజయ్ మాల్యా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. తన జీవన వ్యయాలు, కోర్టు ఖర్చుల కోసం.. జప్తు చేసిన నిధులు పొందేందుకు అనుమతించాలని కోరుతూ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. దివాలా చర్యల్లో భాగంగా జప్తు చేసి కోర్టు నిధుల కార్యాలయానికి అటాచ్ చేసిన నగదులోంచి 1.5 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.15 కోట్లు) తీసుకునేందుకు వీలుకల్పించాలని కోరారు మాల్యా.
పిటిషన్‌ను పరిశీలించిన డిప్యూటీ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ షాఫెర్.. మాల్యా అభ్యర్థనను తిరస్కరించారు. ఈ కేసులో తదుపరి విచారణలు పూర్తయ్యే వరకు.. ఈ ఏడాది తొలినాళ్లలో ఫ్రెంచ్ లగ్జరీ ప్రాపర్టీ లీ గ్రాండ్ జార్డిన్ అమ్మకంతో వచ్చిన నిధులను పొందేందుకు నిరాకరించారు.