Union budget 2022: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 14న మొదలై ఏప్రిల్ 8 వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. మహమ్మారి వ్యాప్తితో దేశంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ బడ్జెట్ రానుండడంతో వివిధ వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఆదాయ పన్ను చెల్లింపుదారులు (64 శాతం) పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి పెంచుతారని ఆశిస్తున్నట్లు కేపీఎంజీ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది సెక్షన్ 80-సీ కింద పొందుతున్న పన్ను రాయితీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి పెంచనున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే రూ.50,000గా ఉన్న వేతన జీవుల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని సైతం మరింత పెంచుతారని 19 శాతం మంది భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ కనెక్షన్, ఫర్నీచర్ సహా ఇయర్‌ఫోన్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై పన్ను రాయితీలు కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ నెలలోనే జరిగిన ఈ ప్రీ-బడ్జెట్ సర్వేలో 200 మంది ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.