ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్‌లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదలచేసింది.
గ్యాస్ దరువు తప్పదా..?
నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఎల్పీజీ ధరలు ఈ మధ్య తోడయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో నవంబర్ ఒకటిన మరోసారి గ్యాస్ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నష్టాల నుంచి గట్టేందుకు ఏకంగా బండపై వంద రూపాయలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం ఓకే అంటే గ్యాస్ బండ కోసం ఇకపై వెయ్యి రూపాయలకు పైగా సమర్పించుకోవాల్సిందే.
పెన్షనర్లకు ఎస్‌బీఐ ఊరట
పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకకు పింఛన్‌దారులు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్ సదుపాయాన్ని కల్పిస్తోంది. నవంబర్ 1 నుంచి ఈ సేవలకు ఎస్‌బీఐ శ్రీకారం చుడుతోంది. వృద్ధులకు నిజంగా పెద్ద ఊరటనే చెప్పాలి.