తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై కొవిడ్‌ దెబ్బ

బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(జీఎన్‌పీఏ) సెప్టెంబర్​ నాటికి 13.5 శాతానికి చేరవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇది 22 ఏళ్ల గరిష్ఠస్థాయి. 1998-99లో ఇవి 14.7 శాతానికి చేరాయి. కరోనా పరిణామాల కారణంగా బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు బలహీనంగా మారొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.

Maintaining banking sector's health remains a priority: Shaktikanta Das
బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై కొవిడ్‌ దెబ్బ

By

Published : Jan 12, 2021, 5:10 AM IST

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(జీఎన్‌పీఏ) 13.5 శాతానికి చేరవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో అంచనా వేసింది. ఇది 22 ఏళ్ల గరిష్ఠస్థాయి. 1998-99లో ఇవి 14.7 శాతానికి చేరాయి. 2020 సెప్టెంబరుకు ఇవి 7.5 శాతం మాత్రమే. ఒక వేళ స్థూల ఆర్థిక వాతావరణం అధ్వానంగా మారి, తీవ్ర ఒత్తిడిలోకి వెళితే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 14.8 శాతానికీ చేరవచ్చని నివేదిక పేర్కొంది. 1997 మార్చి ఆఖరుకు నమోదైన 15.7 శాతం ఇప్పటివరకు అత్యధికం.

'ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల జీఎన్‌పీఏ నిష్పత్తి సెప్టెంబరు 2020లో 9.7 శాతంగా ఉండగా.. ఈ ఏడాది అదే నెల కల్లా 16.2 శాతానికి పెరగవచ్చు. ప్రైవేటు రంగ బ్యాంకులు(పీవీబీ), విదేశీ బ్యాంకుల(ఎఫ్‌బీ) జీఎన్‌పీఏ నిష్పత్తి వరుసగా 2.5 శాతం నుంచి 4.6 శాతానికి; 5.4 శాతం నుంచి 7.9 శాతానికి చేరొచ్చు. ఒక వేళ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం సెప్టెంబరు 2021 కల్లా పీఎస్‌బీ, పీవీబీ, ఎఫ్‌బీల జీఎన్‌పీఏ నిష్పత్తులు వరుసగా 17.6%, 8.8%, 6.5 శాతానికి చేరొచ్చ'ని ఆ నివేదిక అంచనా వేసింది.

ఇబ్బందులు ఇలా

  • కరోనా పరిణామాల కారణంగా బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు బలహీనంగా మారొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంచనా వేశారు. బ్యాంకులకు మూలధన కొరతా ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఆయన పేర్కొన్నారు. నియంత్రణా పరమైన ఊరటలను వెనక్కి తీసుకుంటే ఈ బలహీనతలు, మూలధన కొరతలు మరింత ఎక్కువగా కనిపించవచ్చన్నారు.
  • బ్యాంకులు మూలధనాన్ని పెంచుకోవాలి. ప్రత్యామ్నాయ వ్యాపార నమూనాలతో సవాళ్లను ఎదుర్కోవాలి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మద్దతునివ్వాలి. ప్రభుత్వం తన ఆదాయ కొరత పూడ్చుకునేందుకు రుణాలను పెంచుకుంది. ఇది కూడా బ్యాంకులపై అదనపు భారాన్ని వేసింది.
  • ఇటీవల ఆర్థిక మార్కెట్లలోని కొన్ని విభాగాలకు, వాస్తవ ఆర్థిక వ్యవస్థకు మధ్య లంకె తెగింది. ఇలా భారీగా పెరిగిన విలువలు ఆర్థిక స్థిరత్వానికి అడ్డురావొచ్చు. నష్టభయాలను ఎదుర్కోవడానికి బ్యాంకులు, ఆర్థిక ఇంటర్మీడియట్లు సిద్ధంగా ఉండాలి.
  • గతేడాది మార్చిలో 40 శాతం క్షీణించిన భారత స్టాక్‌ మార్కెట్లు, తదుపరి 80 శాతం పైగా రాణించాయి. లాక్‌డౌన్‌, ఉద్దీపనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యలభ్యత పెరగడంతో ఈ ర్యాలీ సాధ్యమైంది. కొత్త డీమ్యాట్‌ ఖాతాలు సైతం రికార్డు గరిష్ఠాలకు చేరాయి.
  • వ్యాక్సిన్‌ రూపంలో సానుకూల వార్తలు వచ్చాయి. అయితే కరోనా మరోమారు(సెకండ్‌ వేవ్‌) వ్యాప్తి, కొత్త రకం వల్ల అనిశ్చితి ఎదురయ్యే ప్రమాదమూ ఉంది.
  • ఐటీ, డిజిటల్‌ చెల్లింపు ప్లాట్‌ఫామ్స్‌పై మరిన్ని పెట్టుబడులు పెడితేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: ప్రతులు లేకుండానే బడ్జెట్ ప్రసంగం?

ABOUT THE AUTHOR

...view details