తెలంగాణ

telangana

ETV Bharat / business

టెస్లాకు మరిన్ని రాష్ట్రాలు రెడ్‌ కార్పెట్‌.. మస్క్​కు ట్వీట్లు - టెస్లా జయంత్ పాటిల్

Jayant Patil invites Elon Musk: టెస్లా కంపెనీ తమ రాష్ట్రంలో తయారీ యూనిట్​ను నెలకొల్పాలని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానం పలికాయి. మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, బంగాల్ మైనారిటీ శాఖ మంత్రి గులామ్ రబ్బానీ.. ఈ మేరకు ఎలాన్ మస్క్​ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు.

Tesla Minister invitation
Tesla Minister invitation

By

Published : Jan 16, 2022, 3:16 PM IST

Updated : Jan 16, 2022, 6:57 PM IST

Jayant Patil invites Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ను మరో మూడు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం ఆహ్వానించాయి. టెస్లా కంపెనీ స్థాపనకు తమ రాష్ట్రానికి రావాలని శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్వాగతం పలకగా.. తాజాగా మహారాష్ట్ర, పంజాబ్, బంగాల్ సైతం అదే బాటలో పయనించాయి.

మహారాష్ట్ర జలవనరులశాఖ మంత్రి జయంత్‌ పాటిల్‌ ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. భారత్‌లో ప్రవేశానికి ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయన్న మస్క్‌ ట్వీట్‌కు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tesla Manufacturing Plant Maharashtra

"ఎలాన్‌ మస్క్‌.. భారత్‌లో వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. భారత్‌లో మీ కంపెనీ స్థాపనకు కావాల్సిన సహకారాన్ని మహారాష్ట్ర అందజేస్తుంది. మహారాష్ట్రలో మీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తున్నాం" అని జయంత్‌ పాటిల్‌ ట్వీట్‌ చేశారు.

పంజాబ్​కు రండి...

మరోవైపు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం మస్క్​ను పెట్టుబడులకు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. పంజాబ్​లో సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు క్లియరెన్సులు ఇస్తున్నామని తెలిపారు. తద్వారా పంజాబ్​కు కొత్త సాంకేతికత తరలి వస్తోందని, సుస్థిరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఇది తోడ్పడుతుందని అన్నారు.

బంగాల్ అంటే బిజినెస్..

అటు, బంగాల్ మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ గులామ్ రబ్బానీ సైతం టెస్లాకు ఆహ్వానం పలికారు. బంగాల్ అంటే బిజినెస్ అంటూ ట్వీట్ చేశారు. బంగాల్​లో మెరుగైన మౌలికసదుపాయాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు మమతా బెనర్జీ విజన్ సైతం ఉందని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ సైతం...

KTR invites Tesla Tweet:అంతకుమందు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం ఇదే తరహాలో స్పందించారు. రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు.

Tesla entry into India

భారత మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ట్విటర్‌లో పేర్కొన్నారు. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది.

భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై దిగుమతి సుంకాన్ని తగ్గించాల్సిందిగా టెస్లా గతేడాది కోరింది. ముందు విద్యుత్‌ కార్ల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించాల్సిందిగా టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించింది. టెస్లా కోరిన రాయితీలు ఏ వాహన సంస్థకు ఇవ్వడం లేదని, టెస్లాకు పన్ను మినహాయింపులు ఇస్తే, భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీలకు మంచి సంకేతాలు వెళ్లవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇదీ చదవండి:'నవ భారత్​కు వెన్నెముకగా అంకుర సంస్థలు'

Last Updated : Jan 16, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details