కరోనా పోరులో తనవంతు సహకారం అందిస్తామని ప్రకటించిన మహీంద్రా గ్రూప్.. అందులో భాగంగా తొలి అడుగు వేసింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్ అందించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపింది. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్ వెర్షన్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ నమూనాను రూపొందించామని, మూడు రోజుల్లో అనుమతులు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
"కొవిడ్‌పై పోరులో భాగంగా దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. అధునాతన మెషిన్ల ఖరీదు సుమారు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మా బృందం రూపొందించిన ఈ వెంటిలేటర్ సుమారు రూ.7,500 మాత్రమే అవుతుందని అంచనా వేస్తున్నాం" అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీన్ని రూపొందించిన బృంద సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.