దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా & మహీంద్రా(ఎం&ఎం).. ఎక్స్‌యూవీ 700 మోడల్లో మరో రెండు కొత్త వేరియంట్లను మంగళవారం ఆవిష్కరించింది. ఏఎక్స్7 పేరుతో.. ఒక వేరియంట్‌ను ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో, మరో వేరియంట్‌ను మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది కంపెనీ. రెండూ 7 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది.
ఏఎక్స్7 లగ్జరీ ఎంటీ వేరియంట్ ధరను (ముంబయి ఎక్స్‌షోరూం) రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. ఏఎక్స్7 లగ్జరీ ఏటీ+ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ.22.89 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరలు మొదటి 25 వేల బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయని ఎం & ఎం వెల్లడించింది. బుకింగ్స్ అక్టోబర్ 7న ప్రారంభమవుతాయని తెలిపింది.
ఎం & ఎం ఇంతకుముందే.. ఎక్స్‌యూవీ 700 సిరీస్‌లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎంఎక్స్, ఏఎక్స్ పేర్లతో విడుదలైన వీటి ప్రారంభ ధరను రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.