కొద్ది నెలలుగా వంట గ్యాస్ ధరల పెరుగుదలతో(lpg price hike news) సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ ధరలు(petrol price today) ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పట్లో ఈ ధరల పెంపునకు కళ్లెం పడేలా కనిపించటం లేదు. ఇవి చాలవలన్నట్టు.. వచ్చే వారం గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం... భారత్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.100 మేర పెంచాల్సి ఉందని చెప్పాయి. అయితే.. ప్రభుత్వ అనుమతిపైనే రేట్ల పెంపు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి.
ప్రభుత్వం ధరల పెంపునకు(Lpg Gas Cylinder Price) అనుమతిస్తే.. వంట గ్యాస్‌పై ఈ ఏడాది ఐదోసారి పెంచినట్లవుతుంది. చివరి సారిగా అక్టోబర్ 6న ఎల్పీజీ సిలిండర్‌పై రూ.15 పెంచాయి చమురు సంస్థలు. 14.2 కేజీల సిలిండర్‌పై ఈ ఏడాది జులై నుంచి రూ.90 పెరిగింది.
"అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సిలిండర్ ధరపై దాదాపు రూ.100 వరకు అంతరం ఉంది. ఈ నెలలోనే సౌదీలో ఎల్పీజీ ధరలు 60 శాతం పెరిగి టన్నుకు 800 డాలర్లకు చేరుకున్నాయి. ముడి చమురు బ్యారెల్‌కు 85.42 డాలర్లుగా ఉంది. ఎల్పీజీ ఇప్పటికీ నియంత్రిత వస్తువే. సాంకేతికంగా ప్రభుత్వం రిటైల్ విక్రయ ధరలను నియంత్రిస్తోంది. కానీ, అలా చేస్తే నష్టాన్ని భర్తీ చేసేందుకు.. ప్రభుత్వం నుంచి మార్కెటింగ్ సంస్థలకు సబ్సిడీ సొమ్మును అందించాలి. "