ఒకప్పుడు ఉన్నత వర్గాలకే అందుబాటులో ఉండే కారు.. ఇప్పుడు మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మధ్యకాలంలో కార్లు కొనుగోలు చేసేవారిలో సగానికిపైగా మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గీయులే ఉంటున్నారు. మధ్యతరగతి వారి ఆదాయ ప్రమాణాలు పెరగడం వల్ల కార్ల కొనుగోలు ఎక్కువైంది. ఒకప్పుడు జీవితంలో బాగా స్థిరపడితే కానీ కారు కొనుగోలు చేసేవారు కాదు.. అలాంటిది ఇంకా వివాహం కాని యువతీ యువకులు కూడా సొంత కార్లకు రైడర్లు అయిపోతున్నారు. ముగ్గురు, నలుగురు ఉండే కుటుంబం సైతం కారు కోనుగోలుకు మొగ్గు చూపుతోంది. వాయు కాలుష్యంతో ఇబ్బంది పడేవారు సైతం కారు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కారు కొనుగోలుకు రుణాలు బ్యాంకులు విరివిగా ఇస్తున్నాయి. చాలా బ్యాంకులు ధరలో 80-90% వరకు 7 సంవత్సరాల కాలపరిమితికి కూడా రుణాలు అందచేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎంపిక చేసిన కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ డీల్స్‌ను ఆకర్షణీయమైన రేట్లతో ఆఫర్ చేస్తున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్‌తో సహా అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది జులైలో వరుసగా 37%, 26%, 101% పెరిగాయి. పబ్లిక్, షేర్డ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను తగ్గించడానికి, కొవిడ్ బారిన పడకుండా ఉండటానికి చాలా మంది కారు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఈ అమ్మకాలే నిదర్శనం.