ఈ రోజుల్లో ఫోన్ పోవడం అంటే ఒక పరికరాన్ని కోల్పోవడం మాత్రమే కాదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత చిత్రాలు, ఈ-మెయిల్స్, మెసేజ్‌లు సహా సున్నితమైన సమాచారం ఉంటుంది. వీటన్నింటిని ఒక్కసారిగా కోల్పోవడం మనల్ని తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది కదా! మరేం ఫర్వాలేదు. గూగుల్ తల్లి మీకు సాయపడుతుంది. అది ఎలా అంటారా?
గూగుల్... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మీ ఫోన్‌ను కనుగొనడం చాలా సులభం. ఇందుకోసం... మీ అన్ని గూగుల్ ఖాతాల్లోనూ జీపీఎస్‌ను టర్న్ఆన్ చేసి ఉండాలి. అలాగే వర్కింగ్ డేటా కనెక్షన్‌ను కలిగి ఉండాలి. అంతే... మీరు డెస్క్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ ఉపయోగించి పోగొట్టుకున్న మీ ఫోన్‌ను ఎక్కడ ఉన్నా సరే సులభంగా కనుగొనవచ్చు.
డెస్క్‌టాప్ ఉపయోగించి...
1. మీ జీ-మెయిల్ ఖాతాలోకి సైన్ ఇన్ చేయండి. తరువాత హోం పేజీకి వెళ్లండి. కుడివైపు ఎగువన ఉన్న ప్రొఫైల్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
2. గూగుల్ ఖాతాను క్లిక్ చేసి, ఎడమ వైపున ఉన్న 'భద్రత'(సెక్యూరిటీ)ని ఎంచుకోండి. అక్కడ 'మీ పరికరాలు' (యువర్ డివైసెస్) కింద 'పోగొట్టుకున్న/చోరీకి గురైన ఫోన్ కనుగొనండి'పై నొక్కండి.
3. మీరు వెతుకుతున్న పరికరాన్ని (డివైస్)ను ఎంచుకోండి.
4. మీ జీ-మెయిల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, మీ గుర్తింపును ధ్రువీకరించుకోండి.