తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2022, 5:43 AM IST

ETV Bharat / business

Local circles survey: మన సమాచారం ఎవరికో చేరుతోంది..

Local circles survey: తమ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం ఇతరులకు చేరేందుకు టెలికాం సంస్థలు, బ్యాంకులే కారణమ'ని వినియోగదారులు భావిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాపంగా 337 జిల్లాల నుంచి 20,500 మందిని సర్వే చేసినట్లు సంస్థ పేర్కొంది.

localcircles survey on information
మన సమాచారం ఎవరికో చేరుతోంది

Local circles survey: కొత్తగా బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా, సిమ్‌ కార్డు కావాలన్నా ఆధార్‌, పాన్‌ వివరాలు అందించడం తప్పనిసరి. రుణాలు, బీమా పాలసీలు, ప్రయాణాలు ఇలా ఏదైనా సరే.. కొన్ని ముఖ్యమైన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలూ కావాల్సిందే. ఇలా ఇస్తున్న వ్యక్తిగత, ఆర్థిక సమాచారం అనధికార వ్యక్తులు, సంస్థల చేతిలోకి వెళ్లడం వల్ల బాధితులుగా మారిన వారెందరో. తమ పేరుమీద ఎవరో రుణాలు తీసుకున్నారని, ఖాతాలో ఉన్న డబ్బు మాయమయ్యిందని బాధపడేవారి గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

పాన్‌ నెంబరు, పేరు సరిపోలినా.. పుట్టిన రోజు, తండ్రి పేరు, సంతకంలాంటివన్నీ నకిలీవేనని, వీటి ఆధారంగానే రుణాలు తీసుకుంటున్నారని వింటున్నాం. మరొకరి ధ్రువీకరణలతో రుణాలు తీసుకుంటుంటే.. అసలు వ్యక్తులకు క్రెడిట్‌ నివేదిక చూసేంత వరకు ఆ వివరాలు తెలియడం లేదు. ఈ కీలక వివరాలు సదరు నేరస్తులకు ఎలా చేరుతున్నాయనే అంశంపై సామాజికవేదిక లోకల్‌సర్కిల్స్‌ సర్వే నిర్వహించింది. 'తమ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం ఇతరులకు చేరేందుకు టెలికాం సంస్థలు, బ్యాంకులే కారణమ'ని వినియోగదారులు భావిస్తున్నట్లు ఇందులో తేలింది. దేశ వ్యాపంగా 337 జిల్లాల నుంచి 20,500 మందిని సర్వే చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇందులో 34 శాతం మంది మహిళలూ ఉన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 45శాతం, రెండో అంచె నగరాల నుంచి 32శాతం, ఇతర ప్రాంతాల నుంచి 23శాతం మంది పాల్గొన్నారు.

  • సమాచారం లీక్‌ అయ్యేందుకు టెలికాం, బ్రాండ్‌బ్యాండ్‌ సంస్థలే కారణమని 26 శాతం మంది భావిస్తున్నారు. కొత్త ఫోన్‌ నెంబరు తీసుకోగానే అనేక సేవలకు సంబంధించిన కాల్స్‌ రావడం వల్లే అధిక శాతం మంది ఈ నిర్ణయానికి వచ్చారు.
  • బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలదే బాధ్యత అని 15శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రయాణ, షాపింగ్‌ వెబ్‌సైట్లు కారణమని 11 శాతం మంది పేర్కొన్నారు.
  • ఈ సమాచారం ఇతరుల చేతికి ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదని 33శాతం మంది పేర్కొన్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలు, పేమెంట్‌ యాప్‌లు, హోటళ్లు, టిక్కెట్ల బుకింగ్‌ సందర్భాల్లో 'పాన్‌'నే ఎక్కువగా ఇచ్చినందున, దాని ఆధారంగానే తమ వివరాలు మోసగాళ్ల చేతిలోకి వెళ్లాయని భావిస్తున్నారు.
  • గత పదేళ్లలో పాన్‌ వివరాలను బ్యాంకులతో పంచుకున్నట్లు 86శాతం మంది పేర్కొన్నారు. తమ వివరాలను మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు అందించినట్లు 58 శాతం మంది తెలిపారు. రుణాలు, బీమా సేవల సంస్థలకు తమ పాన్‌, ఆధార్‌ వివరాలను అందించినట్లు 54శాతం మంది వెల్లడించారు.
  • డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌లతో తమ వివరాలను పంచుకున్నట్లు 46శాతం, ప్రభుత్వ సేవల కోసం ఇచ్చినట్లు 63 శాతం, సీఏ/లాయర్లకు అందించినట్లు 60శాతం మంది పేర్కొన్నారు.
  • 37శాతం మంది పాన్‌ వివరాలను విమానయాన సంస్థలు/హోటళ్లతోనూ, 30శాతం మంది వ్యాపార సంస్థలు, సేవలను అందించే వారితోనూ పంచుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి తనిఖీలు లేకుండానే అడిగిన సమాచారం ఇచ్చామని 5శాతం మంది పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details