రుణాల చెల్లింపుపై 3 నెలలు మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ గత నెల ప్రకటించింది. కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.
బ్యాంకు ఉద్యోగుల పేరు వాడుకుని రుణ గ్రహీతలను మభ్య పెట్టి ఖాతా వివరాలు సహా ఇతర సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మారటోరియం సదుపాయం(ఈఎంఐల వాయిదా) వినియోగించుకోవడంలో సహాయం చేస్తామనే నేపంతో బ్యాంకు వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
ముఖ్యంగా ఆర్థిక భారం నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
బ్యాంకుల అప్రమత్తత...
సైబర్ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన బ్యాంకులు తమ ఖాతాదారులు వాటి వలలో పడకుండా చర్యలు ప్రారంభించాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారుల మొబైళ్లకు సందేశాలు పంపిస్తున్నాయి.