స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో కరోనా వస్తే ఇంటి వద్ద చికిత్స సరిపోతుంది. కానీ, ఏదైనా తేడా వచ్చినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరడం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతోన్న విషయం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. చికిత్స ఖర్చు అంతకు మించితే.. డబ్బు సమకూర్చుకోవడం కోసం అప్పులు తప్పడం లేదు. పైగా ఇంటి వద్ద కొన్నాళ్లపాటు ఔషధాలు, ఇతర ఖర్చులూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన తమ ఖాతాదారులకు రుణాలందించేందుకు పలు బ్యాంకులు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాయి. సాధారణ వ్యక్తిగత రుణాలు 12-15 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కానీ, ఈ ప్రత్యేక రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్‌బీఐ, యూబీఐలాంటి బ్యాంకులు 8.5శాతం వడ్డీకి కొవిడ్ వ్యక్తిగత రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాంకులు ఈ రుణాలను కనీసం రూ.25,000 నుంచి గరిష్ఠంగా రూ.5,00,000 వరకూ ఇస్తున్నాయి. రుణ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్ల వరకూ ఉంటోంది.