స్టాక్‌మార్కెట్‌లో ఒడుదొడుకులు ఎలా ఉన్నా, ఈ నెలలోనూ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ల జోరు కొనసాగనుంది. పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.10000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమైనట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు నడుస్తున్నాయి. నవంబరులో 10 కంపెనీలు ఐపీఓలను విజయవంతంగా ముగించడం గమనార్హం. ఈ నెలలో పబ్లిక్ ఇష్యూకు రానున్న కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఔషధ విక్రయశాలల సంస్థ మెడ్‌ప్లస్, ఆతిథ్య సేవల టెక్నాలజీ ప్రొవైడర్ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఆర్థిక సేవలు అందించే ఆనంద్ రాఠీ గ్రూప్ సంస్థ ఆనంద్ రాఠీ వెల్త్ వంటివి ఉన్నాయి. మేదాంత బ్రాండ్ కింద ఆసుపత్రులు నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్, మెట్రోబ్రాండ్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, శ్రీభజరంగ్ పవర్ అండ్ ఇస్పాత్, వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ కూడా ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది.
- ఈ కంపెనీలు రూ.10000 కోట్లకు పైగా సమీకరించనున్నాయని, ఈ నిధులు వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. కొన్ని ఐపీఓలు ఆఫర్ ఫర్ సేల్‌గా రానున్నాయి. ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటా విక్రయించుకోవడమే వీటి లక్ష్యం.
- ఈక్విటీ మార్కెట్లలో ఒడుదొడుకులున్నా, బుల్ పరుగు కొనసాగడం కంపెనీలు ఐపీఓలకు రావడానికి మొగ్గుచూపేలా చేస్తున్నాయని లెర్న్‌యాప్ డాట్ కామ్ సీఈఓ, వ్యవస్థాపకుడు ప్రతీక్ సింగ్ అన్నారు. మరికొన్ని నెలలు ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేశారు.
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు 51 కంపెనీలు ఐపీఓలకు వచ్చి రూ.లక్ష కోట్లకు పైగా నిధులు సమీకరించాయి.
రేట్‌గెయిన్ ట్రావెల్ ధరల శ్రేణి రూ.405-425