తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా కాలంలో మంచి పాలసీకి పంచ సూత్రాలు - how to choose life insurance policies in corona time

ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోకుండా దూరమైతే.. ఆ కష్టాలను మాటల్లో చెప్పలేం. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా.. ఆర్థికంగా భద్రత కల్పించే ఏర్పాటు చేస్తే.. కొంతలో కొంత నయం. జీవిత బీమా పాలసీల అవసరం ఇక్కడే మనం గుర్తించాలి.

life insurance policies in corona time
పాలసీకి పంచ సూత్రాలు

By

Published : Jun 9, 2020, 1:28 PM IST

Updated : Jun 9, 2020, 2:20 PM IST

ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న కరోనా కాలంలో.. టర్మ్‌ పాలసీని తీసుకునేటప్పుడు ఏయే అంశాలను పరిశీలించాలో చూద్దాం..

అవసరానికి తగినట్టుగా..

‘నేను లేకున్నా.. కుటుంబానికి ఆర్థిక కష్టం రాకూడదు’ అనేదే టర్మ్‌ పాలసీకి మొదటి సూత్రం. ఆదాయ మార్గాలు, ఆధారపడిన వ్యక్తుల సంఖ్య, బాధ్యతలు, అప్పులు, ప్రస్తుత స్థాయిలోనే జీవించేందుకు అవసరమైన మొత్తం, పిల్లల చదువులు, వారి ఇతర ఖర్చులు, జీవిత భాగస్వామికి భరోసాలాంటివన్నీ బేరీజు వేసుకొని, టర్మ్‌ పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

సరైనదేనా?

పెరిగే బాధ్యతలు, ఆదాయం, ద్రవ్యోల్బణంలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఆఫ్‌లైన్‌లో పాలసీ తీసుకున్నా.. ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నా.. ఇప్పుడు ఈ నాలుగు అంశాలు సాధారణంగా కనిపిస్తున్నాయి.. ఒకేసారి పరిహారం ఇచ్చేవి, నెలనెలా ఆదాయంలా అందించేవి, ఈ మొత్తం ఏటా కొంత మేరకు పెంచి ఇచ్చేవి, ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీలు.. వీటిలో మనకు ఏది సరిపోతుందనేది చూసుకోవాలి. కుటుంబ అవసరాలే దీనికి ప్రాతిపదికగా చూడాలి.

వయసును బట్టి..

పాలసీని తీసుకునేటప్పుడు ఎంత వ్యవధికి తీసుకోవాలన్నదీ ముఖ్యమే. ప్రస్తుత వయసు ఆధారంగా పాలసీ వ్యవధిని నిర్ణయించుకోవాలి. ఆ వ్యవధిలో పెరిగే ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని బట్టి, పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. 25-35 ఏళ్ల మధ్య ఉన్నవారు.. వార్షికాదాయానికి 15-18 రెట్ల విలువైన పాలసీ తీసుకోవాలి. దీనికి అప్పులను కలపాలి. 35-45 ఏళ్ల వయసున్న వారు వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ పాలసీ తీసుకోవాలి. ముందే చెప్పినట్లు.. కుటుంబ అవసరాలను మరోసారి పరిశీలించాకే తుది విలువ గణించాలి.

చెల్లింపుల చరిత్ర

బీమా సంస్థ క్లెయింలను ఎలా పరిష్కరిస్తుందన్నది చూసుకోవాలి. దీనికోసం అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలి. ఇది శాతాల్లో ఉంటుంది. ఎన్ని క్లెయింలు వచ్చాయి, అందులో ఎన్ని పరిష్కరించారు అనేది పరిశీలించాలి. ఏ ఇబ్బందులూ పెట్టకుండా.. పరిహారం ఇచ్చే సంస్థ నుంచే టర్మ్‌ పాలసీ తీసుకోవడం మేలు.

అనుబంధంగా

ప్రాథమిక పాలసీకి అనుబంధంగా కొన్ని రైడర్లను తీసుకోవడం వల్ల పాలసీ విలువ పెరుగుతుంది. క్రిటికల్‌ ఇల్‌నెస్‌, యాక్సిడెంటల్‌ బెనిఫిట్‌, హార్ట్‌కేర్‌, క్యాన్సర్‌ కేర్‌లాంటి అనేకానేక రైడర్లు అందుబాటులో ఉంటాయి. మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థ ఎలాంటి రైడర్లను అందిస్తుందో చూసుకోండి. రైడర్ల కోసం కొంచెం అదనపు ప్రీమియం తప్పదు.

- సంజయ్‌ తివారీ, డైరెక్టర్‌, ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇవీ చూడండి:ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

Last Updated : Jun 9, 2020, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details