LIC market Value: స్టాక్‌మార్కెట్ రికార్డులను భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తిరగ రాస్తుందా? దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ (మార్కెట్ కేపిటలైజేషన్) కలిగిన కంపెనీగా గుర్తింపు సాధిస్తుందా? అంటే .. 'జరగబోయేది అదే' అంటున్నాయి స్టాక్‌మార్కెట్ వర్గాలు. పబ్లిక్ ఇష్యూ ముగిసి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదు కాగానే దేశీయ నమోదిత కంపెనీల్లో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా ఆవిర్భవిస్తుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ స్టాక్‌మార్కెట్లో నమోదైన బీమా కంపెనీల మార్కెట్ విలువ ప్రకారం లెక్కిస్తే, ఎల్‌ఐసీ విలువ దాదాపు 272 బిలియన్ డాలర్లు (రూ.20.32 లక్షల కోట్లు) ఉండాలి. ఇంత అధిక మార్కెట్ విలువ దేశీయ మార్కెట్లో మరే కంపెనీకి లేదు. ప్రస్తుతం రూ.15.77 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో ఉంది. తదుపరి స్థానాల్లో టీసీఎస్ (రూ.14.11 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (రూ.8.44 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.7.32 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (రూ.5.59 లక్షల కోట్లు) ఉన్నాయి. వీటికంటే, ఎంతో అధిక మార్కెట్ విలువతో ఎల్‌ఐసీ అగ్రగామిగా నిలుస్తుందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక విలువ కల జీవిత బీమా సంస్థగా గుర్తింపు సాధిస్తుందనీ అంటున్నారు.
LIC IPO
ఎల్‌ఐసీ విలువను 203 బిలియన్ డాలర్లు (రూ.15.18 లక్షల కోట్లు)గా పరిగణించి, పబ్లిక్ ఇష్యూకు తీసుకువెళ్లాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ సంస్థ ఎంబెడెడ్ వాల్యూ (భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి) రూ.5 లక్షల కోట్లుగా లెక్కించారు. 'ఎంబెడెడ్ వాల్యూ' కు 3.05 రెట్ల అధిక విలువకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో ఉన్న ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే తరహాలో ఉంది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ మాత్రం ఎంబెడెడ్ వాల్యూకు 4.1 రెట్లు అధిక స్థాయిలో కనిపిస్తోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ 2.6 రెట్లుగా ఉంది. వీటితో పోల్చితే వ్యాపార పరిమాణం, బ్రాండు విలువను బట్టి ఎల్‌ఐసీకి ఇంకా అధిక విలువ రావాల్సి ఉంటుంది. దేశీయ జీవిత బీమా పరిశ్రమలో ఎల్‌ఐసీకి 65 శాతానికి పైగా వాటా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌లో మార్కెటింగ్- విక్రయ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, పాలసీదార్లకు ఆన్‌లైన్ సేవలనూ అధికం చేసింది. ఆన్‌లైన్‌లో పాలసీల విక్రయాల నిమిత్తం 'పాలసీబజార్.కామ్' తో ఎల్‌ఐసీ ఒప్పందం చేసుకుంది.