ప్రీమియం చెల్లించనందున, రద్దయిన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు (campaign for revival of lapsed policies) భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. 'స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ (Special Revival Campaign)' పేరుతో దీన్ని ఆగస్టు 23న ప్రారంభించింది. అక్టోబరు 22 వరకు ఇది కొనసాగుతుందని ఎల్‌ఐసీ వెల్లడించింది.
గత అయిదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు ఈ పథకంలో వీలవుతుందని ఎల్‌ఐసీ వివరించింది. ప్రీమియం చెల్లింపునకు వీలుండి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు తిరిగి అమల్లోకి తీసుకురావచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు ఆలస్యపు రుసుములో కొంత రాయితీ (offering concessions in late fee) ఇస్తున్నట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. టర్మ్ పాలసీలకు, అధిక రిస్కు ఉన్న పాలసీలకు ఈ రాయితీ వర్తించదు. ఆరోగ్య పరీక్షల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు.