తెలంగాణ

telangana

ETV Bharat / business

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ ఎప్పుడంటే? - భారతీయ జీవిత బీమా సంస్థ

LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ).. మార్చిలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని తెలుస్తోంది.

LIC IPO
ఎల్‌ఐసీ

By

Published : Jan 14, 2022, 4:44 AM IST

LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూను మార్చిలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఈ నెలాఖరు, లేదా ఫిబ్రవరి మొదట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ.1.75 లక్షల కోట్లు ఖజానాకు చేర్చాలని ప్రభుత్వం భావించగా, ఇప్పటివరకు రూ.9330 కోట్లు మాత్రమే సమీకరించగలిగారు. అందువల్ల ఎల్‌ఐసీ మెగా ఐపీఓను తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంస్థలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా, ఎంతమేర విక్రయించాలనే విషయాన్ని తేల్చే ప్రక్రియ నడుస్తోంది.

రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం?

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.75,000-90,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం సంస్థ విలువను దాదాపు రూ.15లక్షల కోట్లుగా నిర్థారించవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే దేశంలోనే అత్యంత విలువైన సంస్థలైన రిలయన్స్‌ (దాదాపు రూ.17లక్షల కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (దాదాపు రూ.14.3 లక్షల కోట్లు) సరసన ఈ బీమా రంగ దిగ్గజమూ చేరనుంది. ఎల్‌ఐసీ సంస్థాగత విలువ (ఎంబీడెడ్‌ వ్యాల్యూ) రూ.4-5 లక్షల కోట్లుగా అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదిక పెట్టుబడులు- ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి చేరిందని సమాచారం. దీనికి నాలుగు రెట్ల వరకూ మార్కెట్‌ విలువ ఉంటుంది. ప్రస్తుత విలువ, నికర ఆస్తులు, భవిష్యత్తులో వచ్చే లాభాలను పరిగణనలోకి తీసుకుని ఒక సంస్థ విలువను లెక్కిస్తారు. అందువల్ల ఎల్‌ఐసీ పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరిస్తే.. దీని విలువ రూ.15 లక్షల కోట్లుగా మారుతుంది. ఇందుకు పెట్టుబడిదారుల ఆసక్తి, భవిష్యత్‌ లాభాల అంచనాలు, బీమా రంగంలో వచ్చే మార్పులు ప్రభావం చూపుతాయి.

ఇదీ చూడండి:Best future plan for Child: పిల్లలకు వీటిని బహుమతిగా ఇచ్చేయండి!

ABOUT THE AUTHOR

...view details