కొద్ది రోజుల వరకు ఫోన్ కొనాలంటే బ్యాటరీ ఎంత, డిస్‌ప్లే క్వాలిటీ, ఎంత మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయన్నదే ముఖ్యం. తర్వాత 5జీ ఫోన్లు, ఆపైన ఫోల్డింగ్ ఫోన్ల సందడి మొదలైంది. ఇప్పుడు ఏకంగా రోలింగ్ ఫోన్లు రానున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా అమెరికాలోని లాస్‌వెగాస్ వేదికగా జరుగుతున్న సీఈఎస్ 2021లో భవిష్యత్తులో ప్రజల ముందుకు రానున్న ఉత్పత్తులను ప్రదర్శించాయి పలు కంపెనీలు. వాటిపై ఓ లుక్కేద్దామా మరి..
ఎల్ రోలింగ్ డిస్‌ప్లే..
కంపెనీ ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్‌జీ రోలబుల్ డిస్‌ప్లే ఫోన్‌ని ప్రదర్శించింది. ఎల్‌జీ రోలబుల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ డిస్‌ప్లేని కావాలనుకున్నప్పుడు పెద్దదిగా మార్చుకోవచ్చు. పని పూర్తయ్యాక సాధారణ ఫోన్ స్క్రీన్‌లానే మారిపోతుంది. అయితే ఈ ఫోన్‌ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారనే దానిపై పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రయోగాల దశలోనే ఉందని ఎల్‌జీ తెలిపింది.
టీసీఎల్ రోలింగ్ డిస్‌ప్లే
రోలింగ్ డిస్‌ప్లే ఫోన్ల కోసం టీసీఎల్ రోలింగ్ అమోలెడ్ డిస్‌ప్లేను తీసుకొస్తున్నట్లు తెలిపింది. సీఈఎస్ 2021లో ఈ డిస్‌ప్లేని ప్రదర్శించింది. దీన్ని పై నుంచి కిందికి జరుపుకోవచ్చు. 6.7-అంగుళాల నుంచి 7.8-అంగుళాల వరకు ఈ స్క్రీన్ మారుతుంది. దీనితో పాటు 17-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రోలింగ్ డిస్‌ప్లేని కూడా టీసీఎల్ ప్రదర్శించింది. భవిష్యత్తులో టీవీ స్క్రీన్ అనుకూలంగా ఉండేలా ఇంక్‌జెట్ టెక్నాలజీతో దీన్ని రూపొందించినట్లు టీసీఎల్ తెలిపింది.