తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా సంక్షోభంలో ల్యాప్​టాప్​ అమ్మకాల జోరు - laptop sales increases

కరోనా కష్టకాలం కొనసాగుతోన్న ప్రస్తుత సమయంలో కొన్ని వస్తువులకు డిమాండ్ పడిపోయింది. అవసరాల దృష్ట్యా కొన్నింటికి డిమాండ్ పెరిగింది. ఈ పెరిగిన వాటి జాబితాలో ల్యాప్​టాప్ కూడా ఉంది. ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగాయి. వర్క్​ ఫ్రమ్​ హోం, ఆన్​లైన్ పాఠాలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

laptop
ల్యాప్​టాప్​

By

Published : Jun 12, 2020, 11:20 AM IST

ల్యాప్​టాప్.. ఇది ఆధునిక మానవుడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రస్తుత హైటెక్ యుగంలో ఉద్యోగం, వ్యక్తిగత అవసరాలకు కంప్యూటర్ తప్పనిసరిగా మారింది. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే వీలున్న ల్యాప్​టాప్​లు ఎక్కువ మంది వాడుతుంటారు. ప్రస్తుతం కొననసాగుతోన్న లాక్​డౌన్​లో వీటికి గిరాకీ పెరిగింది.

స్మార్ట్​ఫోన్​ కన్నా ల్యాప్​టాప్​ మేలు..

కరోనా కట్టడిలో భాగంగా లాక్​డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్​లైన్​లో తరగతులు నిర్వహిస్తున్నాయి. అంతర్జాల సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్, ల్యాప్​టాప్ లాంటి వాటిల్లో విద్యార్థులు వీటికి హాజరుకావచ్చు. కానీ స్మార్ట్ ఫోన్లలో క్లాసులు వినటం, స్క్రీన్ ను చూడటం వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ల్యాప్​టాప్​లకే మొగ్గు చూపుతున్నారు.

"కరోనా సమస్యతో పాఠశాలలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యేలా కనిపించటం లేదు. ఒకవేళ ప్రారంభమైనప్పటికీ పిల్లలను పాఠశాలలను పంపించాలా? వద్దా? అన్న దానిలో సందిగ్ధం ఏర్పడింది. పాఠశాలల యాజమాన్యాలు ఆన్​లైన్​లో తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్ ఫోన్​లో తరగతులు వినటం సాధ్యం కావటం లేదు. ఇంట్లో ఒక ల్యాప్ టాప్ ఉన్నట్లయితే అందరికి ఉపయోగపడుతుందని కొంటున్నాం."

- శ్రీనివాస్, హైదరాబాద్

లాక్​డౌన్ తో వివిధ కంపెనీల ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్​ చేస్తున్నారు. ఫలితంగా ల్యాప్​టాప్ తప్పనిసరి అయింది. వీటన్నింటి వల్ల ల్యాప్​టాప్ లను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో కళాశాల స్థాయి విద్యార్థులు ల్యాప్​టాప్​లు కొనుగోలు చేస్తుంటారు. ఈ సారి చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 50 శాతం పైగా విక్రయాలు పెరిగాయని ఎలక్ట్రానిక్ స్టోర్ల యజమానులు చెబుతున్నారు.

ఏటా 45 లక్షల పీసీలు..

భారత్​లో పర్సనల్ కంప్యూటర్లు అత్యధికంగా ఏడాదికి 45 లక్షల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా ఉంది. ప్రస్తుత డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కొన్ని కొత్త ల్యాప్​టాప్​ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త కంపెనీలు కూడా మార్కెట్లోకి ల్యాప్​టాప్​లను ప్రవేశపెడుతున్నాయి.

కొన్ని ల్యాప్​టాప్​ మాడళ్లు ఆన్‌లైన్​లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ల్యాప్​టాప్ ఎంపిక చేసుకొని మరుసటి రోజు కొనేందుకు చూసేసరికి స్టాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ల్యాప్​టాప్ లతో పాటు వైఫై రూటర్ లాంటి నెట్​వర్కింగ్ పరికరాలకు కూడా డిమాండ్ పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details