తెలంగాణ

telangana

ETV Bharat / business

'వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి' - suchitra ella speech in cii meeting

తయారీ రంగాన్ని విస్తరించటానికి వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని కోటక్​ మహీంద్రా ఎండీ ఉదయ్​ కోటక్​ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలకు 'డిజిటల్​ మైండ్​' అవసరమని పేర్కొన్నారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత వార్షిక సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.

cii anual meeting 2021
'వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి'

By

Published : Mar 7, 2021, 6:52 AM IST

మన దేశంలో సత్వర ఆర్థికాభివృద్ధి సాధనకు వ్యూహాత్మక తయారీ ఎంతో అవసరమని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ అన్నారు. తయారీ రంగాన్ని విస్తరించటంపై సర్వశక్తులు కేంద్రీకరించాలని సూచించారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత వార్షిక సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలకు 'డిజిటల్‌ మైండ్‌' ఎంతో అవసరమని, ఎంతో వేగంగా మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడిపదార్థాల సరఫరాలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనదేశంలో తయారీ రంగాన్ని విస్తరించటానికి వ్యూహాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగాలని, అంతేగాక నైపుణ్యం కల మానవ వనరులను తయారు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.


ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలను పెద్దఎత్తున కల్పించటం ద్వారా వస్తు, సేవలకు డిమాండ్‌ కల్పించాలని డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి ఈ సమావేశంలో పేర్కొన్నారు. మధ్య, అల్పాదాయ వర్గాల నుంచి మన దేశంలో డిమాండ్‌ అధికమని, ఆయా వర్గాల వారికి పని కల్పించాలని అన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ విస్తృత వల్ల వ్యాపార కార్యకలాపాల నిర్వహణ సమూలంగా మారిపోయినట్లు, తదనుగుణంగా ఉద్యోగాల తీరుతెన్నుల్లో మార్పువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అంతేగాక తమను తాము నిరూపించుకోవాలని లాక్‌హీడ్‌ మార్టిన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విలియమ్‌ ఎల్‌ బ్లెయిర్‌ అన్నారు. భాగస్వామ్యాలు, టెక్నాలజీ మార్పిడి... భవిష్యత్తులో వ్యాపార సంస్థల జయాపజయాలను నిర్దేశిస్తాయన్నారు. హైదరాబాద్‌ టీకాల తయారీ రాజధానిగా ఎదిగినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. 'కొవాగ్జిన్‌' టీకాను స్వతంత్రంగా తయారు చేసినట్లు, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఈ సమావేశంలో శోభనా కామినేని, జనమేజయ సిన్హా... తదితరులు మాట్లాడారు.

ఇదీ చూడండి:అంబానీ గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు!

ABOUT THE AUTHOR

...view details