ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'కూ' మరో మైలురాయిని దాటింది. తాజాగా కూ యూజర్ బేస్ కోటి దాటినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ పేర్కొన్నారు. మరో ఏడాది కాలంలో 10 కోట్ల యూజర్ బేస్‌ను అందుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
కూ యాప్‌ను ఆవిష్కరించిన 15-16 నెలల్లోనే యూజర్ బేస్ ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 85 లక్షల డౌన్లోడ్లను సాధించింది కూ యాప్.
యాహూ న్యూస్ బంద్..
ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ భారత్‌లో తన న్యూస్ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనల కారణంగా.. వార్తా సేవలు కొనసాగించలేకపోతున్నామని ప్రకటించింది. గురువారం (ఆగస్టు 26) నుంచే తమ న్యూస్ వెబ్సైట్(భారత్‌లో)లో కంటెంట్ పబ్లిష్ అవదని పేర్కొంది.
న్యూస్, యాహూ క్రికెట్, ఫినాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్ ఇండియా సేవలు ఇకపై భారత్‌లో నిలిపివేస్తున్న సేవలని పేర్కొంది యాహూ. అయితే ఈ నిర్ణయంతో యాహూ ఈమెయిల్, సెర్చ్ సేవలకు ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. మీడియా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం వరకే ఉండాలి. ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు అక్టోబర్ నుంచి అమలులోకి రానున్నాయి.
ఇదీ చదవండి:ఐటీఆర్-1 ఎవరు దాఖలు చేయొచ్చు.. ఎవరికి వర్తించదు?