మన వద్ద నగదు ఉంటే భద్రత ఉండదని బ్యాంకుల్లో దాచుకుంటాం. కానీ బ్యాంకులు పలు నిబంధనలు పెట్టి సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై బ్యాంక్ ఖాతాదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏటీఎంల్లో నగదు ఉపసంహరణలు నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్న బ్యాంక్‌లు.. గత కొన్నాళ్లుగా బీమ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తున్నాయి. తాజాగా ఈ విషయం కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు(సీబీడీటీ) దృష్టికి రావడంతో బ్యాంకుల తీరును తప్పుపట్టింది. వసూలు చేసిన ఛార్జీలను తిరిగి ఇవ్వాలని తాజాగా సూచించింది.
దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చడంలో భాగంగా డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, బీమ్, తదితర డిజిటల్ పేమెంట్స్ యాప్ అందుబాటులోకి వచ్చాయి. కరోనా.. లాక్‌డౌన్ నేపథ్యంలో వీటి వినియోగం మరింత పెరిగింది. ఈ ఏడాది జులై నెలలో రూ. 2.9లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా.. గతేడాది జులై నెలలో కేవలం రూ. 1.49లక్షల కోట్ల లావాదేవీలే జరిగాయి. అంటే ప్రస్తుతం రెట్టింపు లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకులు యూపీఐ లావాదేవీలపై కూడా ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. గతంలో 50 లావాదేవీల వరకు ఉచితం కాగా.. ఇప్పుడు వాటిని 20కి కుదించడం బ్యాంక్‌ల లాభాపేక్షకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఛార్జీలు ఇలా..
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరోవ్యక్తికి నెలలో 20 లావాదేవీల కంటే ఎక్కువ చేస్తే.. ప్రతి లావాదేవీకి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఓ మీడియా వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకులు రూ. వెయ్యిలోపు నగదును పంపితే రూ. 2.50, వెయ్యికి మించి పంపితే రూ.5 వసూలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. వెయ్యిలోపు అయితే రూ. 2.75, రూ. వెయ్యి దాటితే రూ. 5 వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలకు ఇంకా జీఎస్టీ అదనం.