దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ నుంచి వస్తున్న సరికొత్త వాహనం 'కార్నివాల్'. దీని కోసం తాము బుకింగ్ మొదలుపెట్టిన మొదటి రోజే భారత్ నుంచి 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది. మొత్తం బుకింగుల్లో 64 శాతం.. మూడు వేరియంట్లలో ఒకటైన లిమోసిన్ ట్రిమ్‌కు చెందినవేనని వెల్లడించింది.
"కియా కార్నివాల్ విడుదలకు ముందే అద్భుత ఆదరణ లభిస్తోంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. మేము ప్రీ-ఆర్డర్లు ప్రారంభించిన ఒక్క రోజులోనే భారత్ మార్కెట్ నుంచి 1,410 యూనిట్లు బుక్ అయ్యాయి. ఇది భారత్‌లో కియాకున్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. "- కూఖ్యూన్ షిమ్, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ
ఫిబ్రవరిలో విడుదల
ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో... కియో తమ కారును భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందు కోసం మంగళవారం తన అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభించింది. దేశంలోని 265 టచ్ పాయింట్లలో ఒక లక్ష రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.