తెలంగాణ

telangana

ETV Bharat / business

నోటితో రెమ్‌డెసివిర్‌- ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు

'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని ట్యాబ్లెట్‌ లేదా క్యాప్సూల్‌ రూపంలో తయారు చేసేందుకు దేశీయ ఔషధ కంపెనీ జుబిలెంట్‌ ఫార్మోవా లిమిటెడ్‌ ప్రయత్నాలు చేస్తోంది. జుబిలెంట్‌ ఫార్మోవాకు అనుబంధ సంస్థ అయిన జుబిలెంట్‌ ఫార్మా, ఇప్పటికే ఈ ఔషధాన్ని  జంతువుల్లో, ఆరోగ్యంగా ఉన్న వలంటీర్లపైనా పరీక్షించింది. దీనిపై తదుపరి అధ్యయనాల నిమిత్తం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.

By

Published : Apr 20, 2021, 9:00 AM IST

remidesivir
రెమ్‌డెసివిర్‌

తీవ్రమైన కొవిడ్‌-19 వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రి పాలైన వారికి వైద్యులు సిఫారసు చేస్తున్న 'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని ట్యాబ్లెట్‌ లేదా క్యాప్సూల్‌ రూపంలో తయారు చేసేందుకు దేశీయ ఔషధ కంపెనీ జుబిలెంట్‌ ఫార్మోవా లిమిటెడ్‌ ప్రయత్నాలు చేస్తోంది. జుబిలెంట్‌ ఫార్మోవాకు అనుబంధ సంస్థ అయిన జుబిలెంట్‌ ఫార్మా, ఇప్పటికే ఈ ఔషధాన్ని జంతువుల్లో, ఆరోగ్యంగా ఉన్న వలంటీర్లపైనా పరీక్షించింది. ఈ ఔషధాన్ని నోటి ద్వారా ఇచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని జుబిలెంట్‌ ఫార్మోవా వెల్లడించింది.దీనిపై తదుపరి అధ్యయనాల నిమిత్తం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.

ఇవీ ప్రయోజనాలు

అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ నుంచి లైసెన్సు ఒప్పందంతో మనదేశానికి చెందిన ఏడు ఫార్మా కంపెనీలు 'రెమ్‌డెసివిర్‌' ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ప్రస్తుతం తయారు చేస్తున్నారు. అందులో జుబిలెంట్‌ ఫార్మోవా ఒకటి. ఈ కంపెనీలన్నీ ఐవీ ఫ్లూయిడ్‌ రూపంలో ఇచ్చే ఇంజెక్షన్‌ మాదిరిగా ఈ మందును తయారు చేస్తున్నాయి. రోగికి ఈ మందు ఇవ్వాలంటే ప్రస్తుతం తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిందే. అదే ట్యాబ్లెట్‌ లేదా క్యాప్సూల్స్‌ మాదిరిగా ఈ మందు వస్తే, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. వైద్యులు సిఫారసు చేస్తే, బాధితులే నేరుగా ట్యాబ్లెట్‌/క్యాప్సూల్‌ తీసుకోవచ్చు. ఇందువల్ల ఆసుపత్రి పడక దొరకని బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. పెద్దఎత్తున తయారు చేసి ఔషధానికి కొరత లేకుండా చూడొచ్చు. అందువల్ల ఈ విషయంలో జుబిలెంట్‌ ఫార్మా పరిశోధనలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

తక్కువ ధరలోనే అందించవచ్చు

నోటి ద్వారా తీసుకునేందుకు వీలైన 'రెమ్‌డెసివిర్‌' ఔషధ ఫార్ములేషన్‌ను ఆవిష్కరించామని, దీన్ని ఎంతో తక్కువ ధరలో అందించే అవకాశం ఉందని జుబిలెంట్‌ ఫార్మోవా ఛైర్మన్‌ శ్యామ్‌ ఎస్‌.భర్తియా, ఎండీ హరి ఎస్‌.భర్తియా వెల్లడించారు. పెద్దఎత్తున ఈ మందు తయారు చేసి అందించవచ్చని పేర్కొన్నారు. 5 రోజుల పాటు నోటి ద్వారా ఈ ఔషధాన్ని తీసుకుంటే, ఇంజక్షన్‌ ద్వారా మందు తీసుకుంటే వచ్చే ఫలితాలనే సాధించవచ్చని వివరించారు.

ప్రస్తుతం రూ.899-3490

ఒక్కసారిగా విరుచుకుపడిన కొవిడ్‌-19 రెండోదశతో 'రెమ్‌డెసివిర్‌' ఔషధానికి తాజాగా విపరీతమైన కొరత ఏర్పడింది. పైగా దీని ధర కూడా ఎంతో ఎక్కువ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చొరవతో ఫార్మా కంపెనీలు ఈ మందు ధరను బాగా తగ్గించాయి. అయినా ఇంకా ధర అధికంగానే ఉంది. ఒక ఇంజెక్షన్‌ వయల్‌ ధర రూ.899 నుంచి రూ.3,490 వరకూ పలుకుతోంది. బ్లాక్‌ మార్కెట్‌ ధరకు అంతే లేదు. అందువల్ల తయారీని సాధ్యమైనంతగా పెంచాలని ఫార్మా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికీ ఈ మందుకు ముంబయి, పుణె, విజయవాడ, హైదరాబాద్‌.. తదితర నగరాల్లో తీవ్రమైన కొరత ఉంది. నోటి ద్వారా తీసుకునే 'రెమ్‌డెసివిర్‌' ను ఆవిష్కరించగలిగితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని వైద్య- ఆరోగ్య వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి:ఆరోగ్య బీమా ప్రీమియం 15-35 శాతం భారం!

ఇదీ చదవండి:మార్కెట్లపై కరోనా పంజా- 48వేల దిగువకు సెన్సెక్స్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details