తెలంగాణ

telangana

ETV Bharat / business

బైడెన్ రాకతో భారత్​లో తగ్గనున్న పెట్రో ధరలు!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రపంచంతో పాటు భారత్​పైనా ఎనలేని ప్రభావం చూపిస్తాయి. తాజా ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందడం భారత్​కు ఓ విషయంలో కలిసొచ్చేలా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. బైడెన్ విజయానికి, భారత్​లో పెట్రోల్ ధరలకు సంబంధం ఏంటంటారా?

Joe Biden win likely to soften petrol, diesel prices in India, says expert
బైడెన్ రాకతో దేశంలో తగ్గనున్న పెట్రోల్ ధరలు!

By

Published : Nov 11, 2020, 11:04 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ సాధించిన విజయం భారత ఇంధన పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్​పై ఆంక్షలను బైడెన్ సడలిస్తారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్​ నుంచే అధికంగా చమురు దిగుమతి చేసుకొనే భారత్​.. ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలతో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో త్వరలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే బైడెన్​ ఇరాన్ పట్ల సానుకూల వైఖరితో ఉంటే భారత్​కు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"అధ్యక్ష పదవి చేపట్టాక కొద్ది సమయం తర్వాతైనా ఇరాన్​తో అణు ఒప్పందాన్ని బైడెన్ పునరుద్ధరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు ఇంధన మార్కెట్​పై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. ఈ ఒప్పందం కుదిరితే ఇరాన్ నుంచి తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకొనేందుకు భారత్​కు వీలు కలుగుతుంది."

-డా. హిరాన్మోల్ రాయ్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్​లో ఆర్థిక, అంతర్జాతీయ వర్తక శాఖ అధిపతి

2016లో బరాక్ ఒబామా హయాంలో అమలులోకి వచ్చిన సంయుక్త సమగ్ర కార్యచరణ ప్రణాళిక(జేసీపీఏ)కు కట్టుబడి ఉంటానని ప్రచారం సమయంలో బైడెన్ హామీ ఇచ్చారు. ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. 'ఒకవేళ అణు ఒప్పందానికి ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉంటే.. చర్చలు ప్రారంభించడానికి ప్రారంభ సంకేతంగా జేసీపీఏలో అమెరికా చేరుతుంది.' అని స్పష్టంగా చెప్పారు బైడెన్.

జేసీపీఏను.. అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా, జర్మనీతో కుదుర్చుకుంది ఇరాన్. శుద్ధి చేసిన నాణ్యమైన యూరేనియం నిల్వలను తగ్గించేందుకు ఇరాన్ సహకరిస్తే.. ఆ దేశ చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసే విధంగా ఈ ఒప్పందం కుదిరింది.

భారత్​ చమురుకు ఇరాన్ కీలకం

ట్రంప్ ఆంక్షలు విధించక ముందు భారత్​కు ఇరాన్ మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉండేది. ఇరాన్​ నుంచి 2017-18లో 2.2 కోట్ల టన్నులు, 2018-19లో 2.4 కోట్ల టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది.

చమురు కోసం విదేశాలపైనా ఆధారపడే భారత్​కు అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడటం కలిసివస్తుందని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు. భారత్​లోని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకోవడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోకి వస్తాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details