కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఖర్చులు తగ్గించుకునేందుకు వివిధ రంగాల్లో ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగం పోతే ఆదుకునేందుకు ఉద్యోగ రక్షణ బీమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉద్యోగ నష్ట బీమా.. మనదేశంలో ఇంకా ప్రత్యేక పాలసీగా అందుబాటులోకి రాలేదు. ఇది జీవిత, ఆరోగ్య, గృహ బీమా పాలసీలలో ఒక ఫీచర్‌గా లేదా యాడ్-ఆన్‌గా వస్తుంది.
పరిహారం ఇలా..
కొన్ని పాలసీలు ఉద్యోగ నష్టం వంటి ఊహించని అనేక సంఘటనలకు ఒకేసారి మొత్తాన్ని చెల్లిస్తాయి. వేతనజీవి ఉపాది కోల్పోతే.. ఇలాంటి పాలసీలు నెలకు బీమా చేసిన మొత్తంలో (గరిష్ఠంగా మూడు నెలల వరకు) స్థిరమైన మొత్తాలను (సాధారణంగా 2-3 శాతం) చెల్లిస్తాయి. ఉద్యోగ నష్టానికి బీమా క్లెయిమ్ చేయడానికి 60-90 రోజుల వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది.
వ్యక్తిగత ప్రమాద బీమా విషయంలో..
గాయం లేదా అనారోగ్యం, తాత్కాలిక వైకల్యం కారణంగా పాలసీదారుడు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటే బీమా మొత్తంలో నిర్ణీత శాతం చెల్లిస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇది ముందుగానే నిర్ణయించిన వారాలకు ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలతో నిర్దిష్ట సమయం వరకు ఆసుపత్రిలో చేరితే రోజువారీగా నగదు చెల్లిస్తాయి. అయితే ఇది పాలసీ సంవత్సరంలో నిర్ణీత గడువు వరకు మాత్రమే ఉంటుంది.