40 కోట్ల మందికి పైగా చందాదార్లతో దేశీయ టెలికాం విపణిలో అగ్రగామిగా అవతరించిన రిలయన్స్ జియో, తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు అత్యంత అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్లలో అయిదోవంతు రూ.7000 లోపువని అంచనా. ఇప్పుడు సుమారు రూ.4000 (54 డాలర్ల) ధరలోనే స్మార్ట్‌ఫోన్ తెచ్చేందుకు స్థానిక తయారీదార్లతో కలిసి రిలయన్స్ జియో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వినియోగదార్లకు అందించేందుకు వీలుగా, తయారీ సామర్థ్యం పెంచుకోవాలని స్థానిక తయారీదార్లను కోరుతున్నట్లు ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్ తయారీ ప్రాజెక్టు కోసం గూగుల్ కూడా రిలయన్స్ జియోలో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టిన సంగతి విదితమే. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తోనే జియో స్మార్ట్‌ఫోన్లు కూడా పనిచేస్తాయి. రిలయన్స్ జియో నెలవారీ పథకాలతో అనుసంధానం చేసి, వీటిని విక్రయించనున్నారని సమాచారం.
పోటీ సంస్థల కంటే చవకైన పథకాలతో, దేశీయ మొబైల్ నెట్‌వర్క్ విపణిలో రిలయన్స్ జియోను అనతి కాలంతోనే అగ్రగామిగా చేసిన ఘనత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి దక్కింది. ఇప్పుడు అత్యంత అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లను రెండేళ్లలో 15-20 కోట్ల మేర విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల దేశీయ తయారీ సంస్థలకూ ఊతం లభించనుంది. నెలకు 50 లక్షల వరకు ఫోన్లు జియో చందాదార్లకు సరఫరా చేయాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి.
దీపావళి సమయానికి!