రిలయన్స్ జియోతో చేసుకున్న 43 వేల 574 కోట్ల రూపాయల ఒప్పందం కొత్త ఉత్పత్తులు, సాంకేతికను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు ఉపకరిస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. జియో మార్ట్‌తో కలిసి వాట్సప్ ద్వారా భారత్‌లో మరింత మెరుగైన షాపింగ్, వ్యాపార అనుభవాలను సృష్టిస్తామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. జియోతో ఇదే దార్శనికతతో పనిచేసి రాబోవు నెలలు, సంవత్సరాల్లో మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు ఆయన పెట్టుబడిదారుల సంభాషణలో చెప్పారు.
'ఫేస్‌బుక్, జియోను మరింత విస్తరింపజేస్తాం'
రిలయన్స్ జియోతో చేసుకున్న ఒప్పందం తమ కొత్త ఉత్పత్తులు, సాంకేతికను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌లోనూ మెరుగైన వ్యాపార భాగస్వామ్యాన్ని సాధిస్తామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
సంస్థ బలమైన నగదు నిల్వలు ఈ త్రైమాసికంలో ముఖ్యమైన ఆస్తులుగా రుజువైనట్లు వెల్లడించారు. ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో భారత్‌లో ధీర్ఘకాల వృద్ధికి కట్టుబడి ఉన్నట్లు జుకర్‌బర్గ్ వివరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ యాప్ వినియోగదారులు భారత్‌లోనే ఎక్కువని ఆయన గుర్తుచేశారు. చిన్నవ్యాపారాలకు సేవ చేయడానికి, ధీర్ఘకాలికంగా వాణిజ్యాన్ని ప్రారంభించడానికి ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.
భారత్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది దుకాణాలు, చిన్నవ్యాపారాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు జియోమార్ట్ సహాయపడుతుందని వివరించారు.వాట్సాప్ ద్వారా వినియోగదారులకు ఆ వ్యాపారులతో మాట్లాడటమే కాకుండా చెల్లింపులు కూడా జరపవచ్చని వివరించారు. త్వరలోనే జియో మార్ట్, జియో డిజిటల్ న్యూకామర్స్ వేదిక, వాట్సాయాప్ 3 కోట్ల కిరణా దుకాణాలను అనుసంధానించి నేరుగా వినియోగదారులకు సరకులు అందించనున్నాయి.