Jio-bp Mahindra Group: విద్యుత్ వాహనాలు (ఈవీ), తక్కువ కర్బన పరిష్కారాల నిమిత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. త్రిచక్ర వాహనాలకు బ్యాటరీ మార్పిడి సాంకేతికతపై ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈవీ ఉత్పత్తులు, సేవల సృష్టిపై పనిచేయడం సహా తక్కువ కర్బన, సంప్రదాయ ఇంధనాల్లో పరిష్కారాలను గుర్తించడం కోసం కూడా రిలయన్స్ బీపీ మొబిలిటీ, మహీంద్రా గ్రూప్‌ల మధ్య అవగాహన ఒప్పందం(ఎమ్‌ఓయూ) కుదిరింది.
Jio electric vehicles: మహీంద్రాకు చెందిన విద్యుత్ త్రిచక్ర, నాలుగు చక్రాలు, క్వాడ్రిసైకిళ్లు, ఇ-ఎస్‌సీవీ(4 టన్నుల్లోపు చిన్న వాణిజ్య వాహనాలు)లకు ఛార్జింగ్ సొల్యూషన్లను జియో-బీపీలు అందించనున్నాయి. ఇరు కంపెనీల బలాలను ఈవీ ఉత్పత్తులు, సేవలపై వినియోగించడానికి ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలే జియో-బీపీ తన తొలి మొబిలిటీ స్టేషన్‌ను నెలకొల్పింది. మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్(మాస్), బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(బాస్) వంటి వ్యాపార నమూనాలను ఈ భాగసామ్యం పరిశీలించనుంది. భారత్‌లో విద్యుత్ వాహనాల వాడకాన్ని వేగవంతం చేసేందు కోసం అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీల మార్పిడిని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా చేసుకుంది.
ఇదీ చూడండి:'5జీ వస్తేనే ప్రజలందరికీ డిజిటల్ విప్లవ ఫలితాలు'
'2023 మార్చికి రూ.10-15 లక్షల్లో విద్యుత్ కారు'
Mg motor india: 2023 మార్చి కల్లా రూ.10-15 లక్షల్లో విద్యుత్ కారును విపణిలోకి తీసుకొస్తామని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ విద్యుత్ ఎస్‌యూవీ జెడ్‌ఎస్ ఈవీలను విక్రయిస్తోంది. తదుపరి కొత్త ఉత్పత్తిగా భారతీయ విపణికి సరిపోయేలా అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌పై విద్యుత్ క్రాస్‌ఓవర్ కారును తీసుకొస్తామని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా వెల్లడించారు. రూ.10-15 లక్షల మధ్య వ్యక్తిగత విద్యుత్ వాహనం తీసుకొస్తే ఎక్కువ మంది కొనుగోలుదార్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.