jet set go aviation: క్రికెటర్ యువరాజ్ సింగ్, పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియా పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ జెట్ విమాన సేవల సంస్థ అయిన జెట్‌సెట్‌గో ఏవియేషన్ తన విస్తరణ కార్యకలాపాల కోసం నిధులు సమీకరించే యత్నాల్లో నిమగ్నమైంది. 'కొందరు పెట్టుబడిదార్లతో మాట్లాడుతున్నాం. 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1500 కోట్లు) నిధులు సమీకరించాలన్నది ప్రణాళిక' అని జెట్‌సెట్‌గో వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్ వెల్లడించారు. 'వింగ్స్ ఇండియా 2022' సదస్సుకు హాజరైన ఆమె 'ఈనాడు' తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈవీటోల్స్ సేవలు:నగరాల్లో ట్రాఫిక్‌లో ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడం ఎంతో ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. గంటకు 15- 20 కిలోమీటర్ల సగటు వేగాన్ని మించలేం. ఆకాశ మార్గాన హెలికాఫ్టర్లలో వెళ్లడం ఎంతో ఖర్చు. దీనికి పరిష్కారంగా ఈవీటోల్స్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనికా టేక్రివాల్ తెలిపారు. పైలట్ ఉండని భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయమే ఈవీటోల్స్. ఈ డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్‌తో 40 కిలోమీటర్లు ప్రయాణించగలవు. కి.మీటరుకు ఒక వ్యక్తికి రూ.12 ఖర్చు అవుతుంది. ఎయిర్‌బస్, మరికొన్ని సంస్థలు ఈ డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ తరహా సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు ఆమె వివరించారు. మలిదశలో ముంబయి, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు.