టిక్‌టాక్... భారత్‌లో విపరీతంగా ప్రజాదరణ పొందిన యాప్. ఇందులో తమదైన నైపుణ్యాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ చాలా మంది పేరు తెచ్చుకున్నారు. అయితే సోమవారం టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఫలితంగా ఈ వేదికనే నమ్ముకున్న ఎందరో టిక్‌టాక్ యూజర్లు స్పందిస్తున్నారు. నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆదాయం, బతుకుదెరువు కోల్పోయామని చెబుతున్నారు.
మా గొప్పతనమే..
టిక్‌టాక్‌ను నిషేధించినంత మాత్రాన ఎవరి టాలెంట్‌ను అడ్డుకోలేమని చెప్పింది 23 ఏళ్ల నిహారికా జైన్. ఈమెకు ఆ యాప్‌లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఫలితంగా నెలకు రూ.30వేల ఆదాయం పొందేది. ఈ షార్ట్ వీడియో యాప్ నిషేధం తర్వాత ఆమె మాట్లాడుతూ.. " భారత ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. మేమంతా కంటెంట్ క్రియేటర్లం. మా టాలెంట్ వల్లే మేము పాపులర్ అయ్యాం. టిక్‌టాక్ లేకపోతే మరో యాప్ ద్వారా మా టాలెంట్‌ను ప్రదర్శిస్తాం" అని జైన్ చెప్పింది.
జీవనాధారం పోయినా మోదీకే మద్దతు...
మాస్ కమ్యునికేషన్స్‌లో పట్టా పొందిన మరో అమ్మయి ప్రస్తుతం రియాలిటీ షోలలో ఫ్రీ లాన్సర్‌గా పనిచేస్తోంది. టిక్‌టాక్‌లో వీడియోలు పెట్టడం, విభిన్న స్టైల్స్‌ను అనుకరించడం, ఫ్యాషన్‌పై దృష్టి పెట్టడం వల్ల తన కెరీర్‌ను అభివృద్ధి చెందిందని చెప్పింది. ఆగస్టులో ఈ యాప్‌లో చేరిన ఈమె.. దాదాపు 2.8 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. వేర్వేరు సంస్థలకు ప్రచారం కల్పించేలా వీడియోలు చేసి నెలకు రూ.15 వేల నుంచి 30వేల రూపాయలు సంపాదించుకునేది. యాప్ నిషేధించడం తనను షాక్‌నకు గురిచేసిందని చెప్పిందిఆ అమ్మాయి. "టిక్‌టాక్‌లో వీడియోలు పెట్టడమే నా జీవనాధారం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. మోదీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నాం" అని ఆమె తెలిపింది.
ప్రభావం చూపదు..
నిషేధం నిర్ణయం తమ మీద ప్రభావం చూపదని అంటోంది 23 ఏళ్ల సుక్రిత్ జైన్. 'ద గ్రేట్ ఇండియన్ ఫుడీ' అనే అకౌంట్‌ను ఈమె నడిపేది. అయితే టిక్‌టాక్ నిషేధం ఎదుర్కొనడం వల్ల ఈ కంటెంట్‌ను వేరే మాధ్యమాల్లో పోస్టు చేస్తానని చెబుతోంది. ఇప్పటికే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వీడియోలు పోస్టు చేస్తున్నట్లు తెలిపింది.
టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన భాజపా నేత సోనాలీ ఫొగాట్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమెకు టిక్‌టాక్‌లో 2,80,000 ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ వీడియోలతో సోనాలీ ఆకట్టుకునేవారు. ఈ యాప్ వల్లే 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి బాగా పేరుతెచ్చుకున్నారీ హరియాణా మహిళ.