కరోనా భయాలతో, ఏ దేశానికా దేశం.. చుట్టూ కృత్రిమమైన గోడలు కట్టుకుంటూ వెళుతున్నాయి. కరోనా నుంచి కాపాడుకోవాలనుకుంటున్నాయి. ఇది కాస్తా వస్తువులు, సేవల సరఫరా, గిరాకీపైన తీవ్రమైన దెబ్బ వేస్తోంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అని కాదు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటికే మందగమనంలో ఉన్న ప్రపంచం.. మాంద్యంలోకి జారుకుంటోందా?
అవును. ఈ అనుమానం ఎవరికైనా రాకమానదు. పరిస్థితులన్నీ అలానే కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రభావంతో ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ గత రెండు నెలల వ్యవధిలో 20 శాతం మేర నష్టాల పాలయ్యాయి. బేర్ల పట్టు నుంచి ఇంకా విడిపించుకోలేపోతున్నాయి. జనవరి 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కొవిడ్-19పై తొలి సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అంతర్జాతీయ ముడి చమురు ధరలు 50 శాతం వరకు క్షీణించాయి.
ఇక కంపెనీల సంగతి చెప్పనక్కర్లేదు. కార్యకలాపాలను బాగా తగ్గించాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయండి.. ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పేస్తున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలను భారీగా కోసేశాయి. ముఖ్యంగా విమానయానం, పర్యాటకం, ఆతిథ్యం వంటి రంగాలు బాగా దెబ్బతిన్నాయి.
అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఉన్నట్లుండి ఉద్యోగాల కోత పెరిగింది. ఆ దేశంలో నిరుద్యోగ రేటు 1929 నాటి సంక్షోభ స్థాయికి చేరింది. స్పెయిన్, నార్వే, చైనా, దక్షిణ కొరియా, ఇటలీల్లోనూ ఇదే తరహా ఉద్యోగాల కోత కనిపిస్తోంది. ఐటీ రంగంలో కరోనా కారణంగా 30 శాతం వరకు కొత్త ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్థిక ఊతం కోసం దేశాలన్నీ ప్రకటనలు గుప్పించాయి. రేట్ల కోతలను ప్రకటించాయి. భారీ స్థాయిలూ ఉద్దీపనలూ ఇచ్చాయి. ఐరోపాలోని పలు దేశాలు పన్ను రేట్లను కోత వేశాయి.
ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం?
- మార్చి తొలి వారంలో ఆర్థిక సహకార-అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) తన మధ్యంతర అంచనాలను వెలువరించింది. ఈ అంచనాల ప్రకారం.. 2020లో కొవిడ్-19 వల్ల జీడీపీ వృద్ధి అర శాతం వరకు తగ్గవచ్చు.
- ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా కరోనా వల్ల వర్థమాన ఆసియా దేశాలపై గట్టిగానే దెబ్బపడవచ్చని అంచనా కట్టింది. 0.1-0.4 శాతం వరకు అంతర్జాతీయ జీడీపీ తగ్గవచ్చని లెక్కగట్టింది.
- అంతే కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దాని విలువ 77 బి. డాలర్ల నుంచి 347 బి. డాలర్ల వరకు(రూ.5.39 లక్షల కోట్లు-రూ.24.29 లక్షల కోట్లు) ఉంటుంది.