బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అలాంటి బంగారంపై పరిమితుల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట. అంతకంటే ముందు ఒక కొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం ఇప్పటి వరకు లెక్కల్లో చూపని పసిడిని బహిర్గతం చేసి ‘పన్ను’ చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
ఈ పథకం కింద వ్యక్తులు వద్ద పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందట. 2014-16 మధ్యలో ప్రభుత్వం నల్లధనంపై ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకాల మాదిరిగానే ఇది కూడా ఉండవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెళ్లైన మహిళల వద్ద ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.