ఆర్థికంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కరోనా మనకు ఒక పాఠం నేర్పిందనే అనుకోవచ్చు. ఒక్కసారి అనారోగ్యం బారిన పడితే.. ఇప్పటివరకూ మనం దాచుకున్న మొత్తం డబ్బంతా.. ఖర్చయినట్లే. ఇలాంటి విపత్కర పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న జ్వరం.. పెద్ద వ్యాధిగా మారినా ఆశ్చర్యం లేదిప్పుడు.. ఆసుపత్రిలో చేరినా.. ఆరోగ్య బీమా ఉంటే.. చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక రకంగా దీన్నీ పెట్టుబడిగానే చూడాలి. జీవితంలోని వివిధ దశలను బట్టి, ఈ ఆరోగ్య బీమా పాలసీ ఎంపిక మారాలి.
ఒక్కరికే పాలసీ..
ఉద్యోగంలో చేరిన కొత్తలో.. వివాహం కాక మునుపు జీవితంలో పెద్దగా బాధ్యతలు ఉండవు. ఈ సమయంలోనే సరైన ఆరోగ్య బీమా పాలసీపైన పెట్టుబడి పెట్టాలి. వయసు పెరుగుతున్న కొద్దీ.. వ్యాధులు దరి చేరవచ్చు. అప్పుడు ముందస్తు వ్యాధులకు బీమా సంస్థలు మినహాయింపు వర్తింపజేస్తాయి. ఇలాంటిది రాకుండా.. చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీని తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించడం, నో క్లెయిం బోనస్‌లాంటివి అధికంగా ఉండే పాలసీని ఎంచుకోవాలి. క్లెయిం చేసుకోని సంవత్సరంలో బోనస్‌ను జత చేసే పాలసీలే ఈ సమయంలో ఉత్తమం.
వివాహం.. పిల్లలు..
ఈ దశలో పూర్తిస్థాయి ఆరోగ్య బీమా తీసుకోవాల్సిందే. కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా.. ఆర్థికంగా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువుల ఖర్చులు, ఇతర లక్ష్యాలూ దెబ్బతింటాయి. కుటుంబ సభ్యులందరికీ విడివిడిగా లేదా.. అందరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు గరిష్ఠంగా ఎంత మొత్తం ఎంచుకోవాలనేదీ కీలకమే. ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీలు రూ.కోటికి మించే తీసుకునే వీలుంటోంది. దేశీయంగానే కాకుండా.. విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు వీలు కల్పించే పాలసీలను ఈ దశలో ఎంచుకోవచ్చు.
పదవీ విరమణకు దగ్గరలో..
రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవాళ్లు..ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు.. ఆరోగ్య బీమాను నిర్లక్ష్యం చేయొద్దు. ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే వయసు కాబట్టి, ప్రాథమిక బీమా పాలసీతోపాటు, క్రిటికల్ ఇల్‌నెస్‌లాంటి వాటినీ తీసుకోవాలి. పూర్తిస్థాయిలో అన్ని రకాల వ్యాధుల చికిత్సకూ పరిహారం ఇచ్చే బీమాను చూసి ఎంచుకోవాలి. మలి దశలో ఆసుపత్రి చికిత్సకు అయ్యే ఖర్చులు అధికంగా ఉంటే.. అది మీ పదవీ విరమణ నిధిపై ప్రభావం చూపిస్తుంది.
- ప్రసూన్ సిక్దర్, ఎండీ-సీఈఓ, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ
ఇదీ చూడండి:రుణ విముక్తికి ఎలాంటి ప్రణాళిక అవసరం?